BYD EV Piyush Goyal| భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ కంపెనీలు ఇండియాలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో చైనీస్ కంపెనీ ‘బీవైడీ’ అగ్రస్థానంలో ఉంది. తాజాగా ఈ కంపెనీకి పోటీగా ఎలాన్ మస్క్ కు చెందిన అమెరికన్ ఈవీ కార్ల కంపెనీ టెస్లా కూడా ఈ జాబితాలో చేరింది.
ఈ క్రమంలో బీవైడీ కంపెనీ.. భారతదేశంలో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఇండియాలో బీవైడీ కార్ల తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకు వచ్చినప్పుడు భారత ప్రభుత్వం బీవైడీ (BYD EV) కంపెనీ ప్రతిపాదనను తిరస్కరించింది. మరోవైపు ఇటీవలే అమెరికన్ కంపెనీ టెస్లాను మాత్రం భారత్ లో తయారీ యూనిట్ స్థాపించమని ఆహ్వానిస్తోంది.
భారత ప్రభుత్వం ఇలా రెండు కంపెనీతో వ్యవహరించిన తీరు వెనుక కారణం ఏమిటని ముంబైలో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో ఓ మీడియా ప్రతినిధి.. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ ను (piyush Goyal) ప్రశ్నించారు. కేంద్ర మంత్రి గోయల్ ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. చైనా, భారతదేశం మధ్య ఉన్న రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగానే డ్రాగన్ దేశం నుంచి వచ్చే పెట్టుబడులను నిరాకరించామని ఆయన వివరించారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థకు కూడా ఈ కారణాల వల్ల అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు.
Also Read: చైనా విషయంలో వెనక్కు తగ్గితే మంచిది.. ట్రంప్‌నకు మస్క్ సూచన..
మరోవైపు అమెరికా, భారత్ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని.. టెస్లాను భారతదేశం ఆహ్వానిస్తున్నట్లు పియూష్ గోయల్ తెలిపారు. టెస్లా సంస్థ త్వరలో భారతదేశంలో తమ కార్లను విక్రయించడానికి సన్నద్ధమవుతోందని ఆయన చెప్పారు. అయితే, టెస్లా భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేస్తుందా లేదా అనేందుకు సంబంధించిన వివరాలు ఆయన ఇంకా వెల్లడించలేదు. టెస్లా తమ ఉత్పత్తి ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే, భారతదేశం ఆటోమొబైల్ రంగంలో మరింత ముందుకు దూసుకెళ్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ టెస్లా కార్లు ఎక్కువ ధర ఉండడంతో భారత మార్కెట్ లో ఎలా లాంచ్ చేస్తారో అందరూ వేచి చూస్తున్నారు.
టెస్లా నుంచి చౌక ధర మోడల్
భారతీయ మార్కెట్ కోసం టెస్లా (Tesla) ప్రత్యేకంగా ‘మోడల్ వై’ (Model Y)ను మరింత చౌకైన వెర్షన్‌గా అభివృద్ధి చేస్తోంది. ఈ మోడల్ ధర సాధారణ మోడల్ కంటే 20 శాతం తక్కువగా ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ మోడల్ విడుదల చేయాలని టెస్లా ఉద్దేశిస్తోంది. ఈ మోడల్ ధర సుమారుగా రూ. 21 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం.