Trump Tariff China| అమెరికా (USA), చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం రోజు రోజుకీ తీవ్రమవుతూనే ఉంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలను చైనా పట్టించుకోకపోవడంతో, తాజాగా చైనాపై మరోసారి భారీ స్థాయిలో సుంకాలు విధించారు. దీంతో చైనాపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరుకున్నాయి. ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమలులోకి రానున్నాయి అని అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు.
ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించిన తర్వాత, అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై చైనా 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. చైనా ఎదురు సుంకాలు విధించడంలో ఆగ్రహించిన ట్రంప్ ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. లేకపోతే, అదనంగా మరో 50 శాతం సుంకం విధిస్తానని చెప్పారు. చైనా ఈ గడువులోగా స్పందించకపోవడంతో, ట్రంప్ ప్రకటనకు అనుగుణంగా.. ప్రభుత్వ యంత్రాంగం ఆయన నిర్ణయాన్ని అమలు చేసింది. చైనా ఉత్పత్తులపై తాజాగా మరో 50 శాతం సుంకాలు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
Also Read: ‘ఎక్స్‌కూజ్ మీ’ అన్నందుకు మహిళలను చితకబాదిన జనం.. మాతృభాషలో మాట్లాడకపోతే అక్కడ అంతే
అమెరికా సుంకాలు అమాంతం పెంచేయడంతో చైనా తీవ్రంగా మండిపడింది. అమెరికా బ్లాక్ మెయిల్ చేస్తోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. మరోవైపు అమెరికా విధిస్తున్న సుంకాలు విధించడాన్ని చైనా ప్రీమియర్ (ప్రధాన మంత్రి) లీ కియాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సుంకాల పేరుతో అమెరికా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది. దీని పై మేం చివరివరకు పోరాడతాం. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను రూపొందించుకున్నాం. ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు అమెరికా ఏకపక్షవాదం, రక్షణవాదం, ఆర్థికపరంగా బలవంతపు చర్యలుగా మారుతున్నాయి. దీనిపై మేము తప్పకుండా ప్రతిస్పందిస్తాం. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు పోరాడతాం’’ అని లీ కియాంగ్ అన్నారు.
ట్రంప్ సలహాదారుడు ఓ మూర్ఖుడు.. సుంకాలను వ్యతిరేకించిన ఎలాన్ మస్క్
ఇక అమెరికాలో ప్రెసిడెంట్ సన్నిహితుడు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆయన సుంకాల విధానాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా సలహాదారుడు పీటర్ నవారోపై ఆయన తాజాగా విమర్శలు చేశారు. ట్రంప్ సలహాదారుడు మూర్ఖుడని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ‘‘నవారో మూర్ఖుడు’’ అంటూ ఎలాన్ మస్క్ మండిపడ్డారు. వైట్‌హౌస్ సీనియర్ అడ్వైజర్ పీటర్ నవారో.. ఇటీవల మస్క్ కార్ల కంపెనీ టెస్లా బిజినెస్ పై విమర్శలు చేశారు. “టెస్లా కేవలం అసెంబ్లింగ్ కంపెనీ అని, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, టైర్లు వంటి విడిభాగాలను చైనా, జపాన్ నుంచి తీసుకుని వచ్చి అమెరికాలో కేవలం అసెంబ్లింగ్ చేస్తున్నారు.” అని పీటర్ నవరో వ్యాఖ్యానించారు. ఆయనకు (Elon Musk) చౌకగా లభించే విదేశీ విడిభాగాలు కావాలని నవారో ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ‘‘టెస్లా అమెరికాలో తయారయ్యే కారు కంపెనీలలో అగ్రగామిగా ఉంది’’ అని చెప్పిన మస్క్ ట్రంప్ సలహాదారులపై విమర్శలు కురిపించారు. ట్రంప్ టారిఫ్ విధానంపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, చైనాపై సుంకాలను వెనక్కి తగ్గాలని సూచించారు. అయితే ఈ అంశంపై ట్రంప్ తో మస్క్ జరిపిన చర్చలు విఫలమయ్యాయని మీడియా కథనాలు ప్రచురించింది.