Trump Buy GreenLand | అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్.. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్ భూభాగాన్ని కొనుగోలు చేస్తానని ప్రకటించారు. ఈ ఆలోచన కార్యరూపం దాలిస్తే, గ్రీన్‌లాండ్ కొనుగోలుకు ఎంత చెల్లించాల్సి వస్తుంది? దాని ధర ఎంత ఉండవచ్చన్న ప్రశ్న అందరి మదిలో మెదలుతోంది. రియల్ ఎస్టేట్ డెవలపర్, న్యూయార్క్ ఫెడ్ మాజీ ఆర్థికవేత్త డేవిడ్ బార్కర్ వేసిన అంచనా ప్రకారం.. గ్రీన్‌లాండ్ ధర కనీసం 12.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. లక్ష కోట్లకు పైనే) నుంచి గరిష్టంగా 77 బిలియన్ డాలర్లు (రూ. 6.5 లక్షల కోట్ల) మధ్య ఉండవచ్చు.
గ్రీన్‌లాండ్ భూమిపై రాగి, లిథియం, బాక్సైట్ వంటి ఖనిజాలు విరివిగా ఉన్నట్లు సమాచారం. ఈ ఖనిజాలు ప్రధానంగా బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఆధునిక టెక్నాలజీలలో వినియోగించబడుతున్నాయి. రాగి, లిథియం వంటి ఖనిజాల ప్రాముఖ్యత సమకాలీనంగా పెరిగింది, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులు, విద్యుత్తు వాహనాల అవసరం, తక్కువ కార్బన్ ఉద్గారాల వంటి అంశాల దృష్ట్యా గ్రీన్‌లాండ్‌లోని ఖనిజసంపదపై అమెరికా దృష్టి పెట్టింది.
అయితే, ఆర్థికవేత్త డేవిడ్ బార్కర్ ప్రకారం, గ్రీన్‌లాండ్ విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుంటే దాని విలువ పెరిగినా, కేవలం ఖనిజసంపదనే కాకుండా, ఇతర భద్రతా, వ్యూహాత్మక అంశాలను కూడా గుర్తించాల్సి ఉంటుంది. అమెరికా జాతీయ భద్రత కోసం గ్రీన్‌లాండ్ కీలకం. ఈ కారణలతో ద్వీపం విలువ మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫైనాన్షియల్ టైమ్స్ అంచనా ప్రకారం, గ్రీన్‌లాండ్ ఖనిజసంపద విలువ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు (రూ. 94 లక్షల కోట్లు)గా ఉండవచ్చు. కానీ, డేవిడ్ బార్కర్ ఈ అంచనాలను వాస్తవానికి దగ్గరగా ఉండవని అన్నారు. అంతేకాకుండా, గ్రీన్‌లాండ్ ఖనిజసంపద మొత్తం విలువపై చాలా చర్చలు జరుగుతున్నాయి.
గతంలో అమెరికా విదేశీ భూభాగాలను కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 1803లో ఫ్రాన్స్ నుంచి లూసియానా, 1867లో రష్యా నుంచి అలస్కా, 1917లో డెన్మార్క్ నుంచి యూఎస్ వర్జిన్ ఐలాండ్స్‌ను అమెరికా కొనుగోలు చేసింది. అయితే, గ్రీన్‌లాండ్ ను కొనుగోలు చేయాలనే ఆలోచన కొత్తది కాదు. 2016లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను “గొప్ప అవకాశంగా” అభివర్ణించారు, కానీ డెన్మార్క్ ఈ ఆలోచనను పూర్తిగా తిరస్కరించింది.
1940ల నాటి కోల్డ్‌వార్ సమయంలో, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ గ్రీన్‌లాండ్‌ను 100 మిలియన్ డాలర్ల బంగారంతో కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. కానీ అప్పట్లో డెన్మార్క్ ఈ ఆఫర్‌ను తిరస్కరించింది.
Also Read: బూడిదైన రూ.10,770 కోట్ల బంగ్లా.. నిప్పు ఆర్పేందుకు నీళ్లు కూడా లేవాయే!
ప్రస్తుతం, గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవడం అంత తేలిక కాదు. జాతీయ భద్రతాపరమైన కారణాలతో.. గ్రీన్‌లాండ్ వాస్తవంగా చాలా కీలకమైన భూభాగంగా మారింది. అయితే, గ్రీన్‌లాండ్ ప్రభుత్వం ట్రంప్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2023లో గ్రీన్‌లాండ్ ప్రధాన మంత్రి మ్యూట్ బౌరప్ ఎగిడే.. తమ దేశాన్ని అమ్మకానికి పెట్టే ప్రసక్తే లేదని, భవిష్యత్తులో కూడా ఈ దేశ భూభాగం విక్రయించే ప్రస్తక్తే ఉండదని స్పష్టం చేశారు.
కానీ ట్రంప్ మాత్రం గ్రీన్ ల్యాండ్ విషయంలో గట్టిగానే ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఆయన గ్రీన్ ల్యాండ్ దీవి కొనుగోలు చర్చలు చేస్తానని.. చర్చలతో కాకపోతే ఆంక్షలు విధిస్తానని.. అదీ కుదరత పోతే సైనిక చర్యలు చేపడతానని చెప్పారు. కానీ ట్రంప్ చెప్పినంత ఈజీ కాదు. ఆయన పనామా కెనాలా కొనేస్తానని చెప్పారు. అది సాధ్యపడవచ్చు.
కానీ ఒక దేశ భూభాగం నేటి యుగంలో మరో దేశం కొనుగోలు చేయడమనేది చాలా అరుదు అనే చెప్పాలి. జాతీయ భావం, ప్రజాస్వామ్య విలువలు, అంతర్జాతీయ చట్టాలు.. ఇలాంటి భారీ అంతర్జాతీయ లావాదేవీలు జరగడానికి అడ్డుగా మారుతాయి. గ్రీన్ ల్యాండ్ కు ఒక ధర నిర్ధారించవచ్చు, కానీ అది ఒప్పందంగా మారడం అత్యంత దుర్లభం. గ్రీన్ లాండ్ విక్రయం జరిగితే.. ఆ ఒప్పందం ఈ శతాబ్దానికే గుర్తింపు తీసుకువస్తుందని ఆర్థికవేత్త బార్కర్ అభిప్రాయం.