US Military Transgender Ban | అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మిలిటరీలో ట్రన్స్‌జెండర్లకు (లింగమార్పిడి చేసుకున్నవారు) నియమించడంపై ఆయన నిషేధం విధించారు. ఈ ఆదాశాల ఆయన సోమవారం జారీ చేశారు. ట్రంప్ ఆదేశాల ప్రకారం.. పుట్టుకతో పురుషుడు లేదా మహిళగా ఉన్నవారు.. తమ లింగాన్ని మార్చుకోవాలని భావిస్తే అలాంటి వారు సైన్యంలో చేరేందుకు, విధులు నిర్వర్తించేందుకు అర్హులు కాదు.
అయితే అమెరికా డిఫెన్స్ సెక్రటరీ.. రక్షణ మంత్రిత్వ శాఖ చీఫ్ అయిన పీట్ హెగ్ సెత్‌కు ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు పూర్తిగా అమలు చేసేందుకు 60 రోజుల సమయం ఇచ్చారు. ఈ ఆదేశాల ప్రకారం.. సైన్యంలో వైద్య నిబంధనలు 60 రోజుల్లో లింగ నిర్ధారణకు సంబంధించి అమలవుతాయి. అయితే ట్రాన్స్‌జెండర్లపై నిషేధం ఎలా అమలు చేస్తారో 30 రోజుల్లో ఆయన స్పష్టత ఇవ్వాలి.
క్రమశిక్షణ కఠినంగా పాటించే సైన్యంలో ఒక లింగంతో పుట్టి మరో లింగంలోకి మారడం ఏ విధంగా ఆమోద యోగ్యం కాదని ట్రంప్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అందుకే సైన్యంలో ప్రస్తుతం సేవలందించే ప్రతి ఒక్కరికీ వారి పుట్టుకతో ఉన్న లింగంతో మాత్రమే గుర్తింపు లభిస్తుంది. అలాగే కొత్త నిబంధనల ప్రకారం.. మిలిటరీలో ఇప్పటికే ఉన్న పురుషులు లేదా మహిళలు తాము ట్రాన్స్‌జెండర్లుగా మారిపోయామని భావించినా వారు తమ పుట్టక లింగం కోసం కేటాయించిన బాత్రూంలు (స్నానపు గదులు), టాయిలెట్లు, నిద్రపోయే ప్రదేశాలు మాత్రమే వినియోగించాలి. వ్యతిరేక లింగాని చెందినవి ఉపయోగించడంపై నిషేధం విధించబడింది.
Also Read: డీప్‌సీక్ ప్రభంజనం.. స్టార్‌గేట్ ప్రాజెక్టుకు భారీ పెట్టుబడులు అవసరమా.. ట్రంప్ స్పందన
అమెరికా సైన్యంలో ఎంత మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారో అధికారికంగా డేటా లభించలేదు. కానీ అంచనాల ప్రకారం.. 9000 నుంచి 15000 మంది ట్రాన్స్‌జెండర్లు ఇప్పటికే అమెరికా సైన్యంలో సేవలందిస్తున్నారు. వీరందరూ ట్రంప్ జారీ చేసిన ట్రాన్స్‌జెండర్ బ్యాన్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అమెరికా సైన్యంలో ఒకప్పుడు ‘డోంట్ ఆస్క్, డోంట్ టెల్’ అనే పాలసీ ఉండేది. ఈ పాలసీ ప్రకారం.. సైన్యంలో ఉద్యోగాలు చేసేవారి లింగంపై ప్రశ్నించకూడదు. కానీ ఈ పాలసీ 2011లో తొలగించారు. అయినా ట్రాన్స్ జెండర్లకు మాత్రం ఉద్యోగంలో కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
2016 సంవత్సరానికి ముందు మిలిటరీ ట్రాన్స్ జెండర్ల నియామకంపై నిషేధం ఉండేది. కానీ 2016లో అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా ఈ నిషేధాన్ని తొలగించి.. ట్రాన్స్‌జెండర్లకు ఊరటనిచ్చారు. అయితే 2017లో ట్రంప్ ఈ నిషేధాన్ని పాక్షికంగా అమలు చేశారు. అప్పటికే సైన్యంలో ఉన్న ట్రాన్స్‌జెండర్లను కొనసాగించి.. కొత్త వారిని నియమించకూడదని ఆదేశించారు. కానీ ట్రంప్ ఉద్దేశం మిలిటరీలో ఉన్న ట్రాన్స్‌జెండర్లందరినీ తొలగించాలని. అయితే కోర్టులో కేసులు ఎదురుకావడంతో ట్రంప్ కొత్త నియమకాల వరకే ఆదేశాల పరిమితం చేశారు. అయితే మళ్లీ 2021లో జో బైడెన్ అధ్యక్షుడిగా రాగానే ట్రంప్ ఆదేశాలను రద్దు చేసి మిలిటరీలో ట్రాన్స్‌జెండర్ల నియమకంపై అనుమతించారు. అలాగే ట్రాన్స్‌జెండర్లందరికీ వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకున్నారు.
ఇప్పుడు ట్రంప్ రెండో సారి అధ్యక్షుడు కాగానే ట్రాన్స్‌జెండర్లపై మళ్లీ కొరడా ఝళిపించడానికి సిద్ధమయ్యారు. కానీ ట్రంప్ నిర్ణయాలను కొందరు సైనికాధికారులు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. అమెరికా నౌకాదళంలో సేవలందించే నేవీ కమాండర్ ఎమిలీ షిల్లింగ్, రిటైర్డ్ ట్రాన్స్‌జెండర్ సారా క్లిమ్ లాంటి వారు మిలిటరీలో ప్రతిభను కనబరిచే ట్రాన్స్‌జెండర్లను ఎలా తొలగిస్తారు. అలా చేస్తే వ్యవస్థ మొత్తం అతలాకుతలమవుతుందని వాదిస్తున్నారు. “చాలా మంది ట్రాన్స్‌జెండర్లు బాంబులు వేస్తున్నారు, తుపాకులు పేలుస్తున్నారు, ఆయుధాలు రిపేరు చేస్తున్నారు. ఇదంతా సమర్థవంతంగా చేస్తున్నారు. మరి ఏమిటి అభ్యంతరం” అని సారా క్లిమ్ ప్రశ్నించారు. అమెరికా సెనేటర్ ఆండీ కిమ్ మాట్లాడుతూ.. “ట్రంప్ ఆదేశాలు దేశం కోసం ధైర్య సాహసాలు చూపిన ట్రాన్స్‌జెండర్లకు అవమానకరంగా ఉన్నాయి” అని అభిప్రాయపడ్డారు.
ట్రింప్ ట్రాన్స్‌జెండర్లపై విధించిన నిషేధాన్ని స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి (GLAD LAW, NCLR) అసోసియేషన్లు మరోసారి కోర్టులో సవాల్ చేయనున్నాయి. అమెరికా రాజ్యాంగం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వారి వాదన.