Trump Pakistan Crypto Deal| ఉగ్రవాదంపై పోరాటం చేస్తాం.. అసలు సహించం అని ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా తెరవెనుక మాత్రం ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే పాకిస్తాన్ లో దోస్తి చేస్తుంది. భారతదేశంలో దాడులు చేసి అమాయక ప్రజలను చంపే ఉగ్రవాదులకు అండగా నిలిచే పాకిస్తాన్‌పై ఇండియా సైనిక చర్యలు చేపడితే అమెరికా మాత్రం పాకిస్తాన్ ను కాపాడుతుంది. దీని వెనుక అర్థం ఏంటి? అని అందరికీ కలిగే ప్రశ్న. అయితే పాకిస్తాన్, అమెరికా మధ్య రెండో ప్రపంచ యుద్ధం తరువాత నుంచి ఉగ్రవాదులను సరఫరా చేసే సంబంధాలు ఉన్నా.. ఇప్పుడా బంధం మరింత బలపడింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ తో వ్యక్తిగతంగా ఓ రహస్య బిజినెస్ డీల్ కుదుర్చుకున్నాడు. తాజాగా దాని గురించి సమాచారం వెలుగులోకి వచ్చింది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రహస్య ఒప్పందం.. అమెరికాలోని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ అయిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య కుదిరింది. ఈ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్.. పాకిస్తాన్ ప్రభుత్వం నెల రోజుల క్రితమే ఏర్పాటుచేయడం గమనార్హం. మరోవైపు అమెరికాలోని వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ కంపెనీలో ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్.. ఈ ముగ్గురికీ కలిపి సుమారు 60 శాతం వాటా ఉంది. రెండు పక్షాల మధ్య లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) సైతం కొనసాగుతున్నట్టు సమాచారం.
ఈ ఒప్పందం కుదిరిన కొద్ది రోజుల్లోనే, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌కు సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావోను నియమించింది.
అదే సమయంలో.. అమెరికా నుండి వచ్చిన ప్రతినిధి బృందానికి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఘనంగా స్వాగతం పలికారు. ఆ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు జాకరీ విట్కాఫ్. ట్రంప్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వారి వ్యాపారంలో భాగస్వామి అయిన స్టీవ్ విట్కాఫ్ కుమారుడే ఈ జాకరీ విట్కాఫ్. ప్రస్తుతం జాకరీ విట్కాఫ్ మిడిల్ ఈస్ట్ దేశాలకు అమెరికా ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో ట్రంప్ కు చెందిన ఈ బృందం రహస్య సమావేశాలు కూడా నిర్వహించినట్టు సమాచారం.
Also Read: పాక్ ఆ పని చేసేంతవరకు సింధూ జలాల ఒప్ఫందంపై చర్చలు ఉండవు.. తేల్చి చెప్పిన జై శంకర్
ఈ ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్ దేశ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రారంభించనున్నారు. ఇందులో ఆస్తుల టోకనైజేషన్, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్, స్టేబుల్‌కాయిన్ అభివృద్ధిపై పైలట్ ప్రాజెక్టుల నిర్వహణకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్‌లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణ చేసి బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవలు ప్రజలందరికీ చేరేలా చేసే ప్రయత్నం జరగనున్నట్టు తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందే ఈ రహస్య క్రిప్టో కరెన్సీ ఒప్పందం జరగడం.. ఆ తర్వాత పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ట్రంప్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ ఒప్పందంపై అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ అంశంపై స్పందిస్తూ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ ఒక ప్రకటన చేసింది. తాము చేసుకున్న ఒప్పందం వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. కానీ, ట్రంప్ కుటుంబం లేదా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.