Trump Tariff Break| సుంకాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రకంపనలు సృష్టించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయంగా ఒత్తిడికి వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. భారత దేశంతో పాటు 75కి పైగా దేశాలపై విధించిన టారిఫ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఈ అదనపు టారిఫ్‌లు అమలు చేసిన 24 గంటల వ్యవధిలోనే వాటిని వాయిదా వేశారు. 90 రోజులపాటు ప్రతీకార సుంకాలను నిలిపివేసేందుకు బుధవారం ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. కానీ, చైనాపై మాత్రం అమెరికా సుంకాల దాడి కొనసాగుతుందని ట్రంప్ తెలిపారు. పైగా చైనాతో పోరు మరింత ఉధృతం చేశారు. బుధవారం ఈ విషయంలో వేగంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైనాపై 50 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే, అమెరికాపై అదే శాతంతో చైనా ప్రతీకారం తీర్చుకుంది.
మరోవైపు అమెరికాపై ఎదురుదాడికి దిగిన చైనా.. అమెరికా ఉత్పత్తులపై గురువారం నుంచే 84 శాతం సుంకాలను అమలులోకి తేనున్నట్టు స్పష్టం చేసింది. ట్రంప్ చైనా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందుకే 104 శాతంగా ఉన్న చైనా ఉత్పత్తులపై సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచినట్టు తెలిపారు. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికాపై యూరోపియన్ దేశాల కూటమి కూడా ప్రతీకార చర్యల్లో భాగంగా 23 బిలియన్ల డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై అదనపు టారిఫ్‌లు విధించబోతున్నామని తెలిపింది. కెనడా కూడా అమెరికా ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలు విధించనుందని ప్రకటించింది.
ట్రంప్ తన సుంకాల నిలిపివేత నిర్ణయంపై వివరించారు. తమ టారిఫ్ విధానాన్ని పునరాలోచించాల్సి వచ్చిందని అంగీకరించారు. టారిఫ్‌ల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగా పడడంతో, ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉన్నదని గ్రహించి.. చైనా మినహా మిగతా అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను 90 రోజులపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘ఆ దేశాలు చైనా మాదిరిగా ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. పైగా, మాతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నందుకే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో వెల్లడించారు.
దీంతో భారత్ సహా ఆయా దేశాలకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది. ట్రంప్.. ఇండియాపై 26 శాతం అదనపు సుంకాలు విధించగా, తైవాన్‌పై 32 శాతం, మడగాస్కర్ దేశంపై 47 శాతం, లెసొతోపై 50 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం, జపాన్, యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం, వియత్నాంపై 46 శాతం టారిఫ్‌లు విధించారు. ఇవన్నీ బుధవారం నుంచే అమలులోకి రాగా, 24 గంటలు కూడా గడవకముందే వాయిదా పడిపోయాయి. అయితే ట్రంప్ పేర్కొన్నట్లుగా ఈ దేశాలపై ఇంతకుముందులా 10 శాతం ప్రాథమిక టారిఫ్ మాత్రం కొనసాగుతుంది. చైనా విషయంలో మాత్రం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చైనా నాపట్ల, అంతర్జాతీయ మార్కెట్ల పట్ల ఏమాత్రం గౌరవం చూపడం లేదు. సుంకాలు తగ్గించాల్సిన బదులు, ఇంకా రెచ్చిపోతోంది.’’ అంటూ ట్రంప్ మండిపడ్డారు.
ఇప్పటికే ఉన్న 104 శాతం టారిఫ్‌ను 125 శాతానికి పెంచినట్టు వెల్లడించారు. ఇది ఏకంగా అమెరికా ఏ దేశంపైనా విధించిన అత్యధిక సుంకాలుగా నిలిచింది. చైనా మాత్రం తాము తలకిందులుగా కూర్చోబోమని స్పష్టం చేస్తూ, అమెరికాపై మరో 50 శాతం టారిఫ్‌లు విధించనుందని ప్రకటించింది. ‘‘ఇప్పటికే ఉన్న 34 శాతంతో కలిపి, గురువారం నుంచి మొత్తం 84 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తాం’’ అని తెలిపింది. దాంతో రెండు ప్రపంచ ఆర్థిక శక్తుల మధ్య ఈ వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది.
Also Read: వారంతా యాచిస్తున్నారు.. ప్రపంచదేశాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్
అంతేకాక, అమెరికా దిగుమతి చేసుకుంటున్న అన్ని ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలు గత గురువారమే అమలులోకి వచ్చాయి. మొదటిది కార్లపై వర్తిస్తుండగా, మే 3 నుంచి ఆటో విడిభాగాలపై కూడా వర్తించనుంది. దీనికి ప్రతిగా కెనడా కూడా బుధవారం నుంచే అమెరికా ఆటో ఉత్పత్తులపై 25 శాతం అదనపు టారిఫ్‌లు విధించనుంది.
మేము అన్నింటికీ సిద్ధం
అమెరికా దూకుడు చర్యలకు తాము తగ్గే ప్రసక్తే లేదని చైనా తన అధికార వార్తా సంస్థ జిన్‌హువా ద్వారా స్పష్టం చేసింది. అమెరికా ఉత్పత్తులపై 84 శాతం టారిఫ్‌లు అమలులోకి తెస్తామని, మరోవైపు 12 యూఎస్ కంపెనీలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చుతున్నామని వెల్లడించింది. అంతేకాకుండా తైవాన్‌కు ఆయుధాలు విక్రయించిన ఆరోపణలతో ఆరు అమెరికన్ కంపెనీలను అనుమానాస్పద జాబితాలో చేర్చనున్నట్టు ప్రకటించింది.
చైనా విడుదల చేసిన శ్వేతపత్రంలో అమెరికా విధానాలను ఏకపక్షంగా పేర్కొంటూ, అవి చైనా హక్కులను తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించింది. దీనికి తోడు ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ వ్యవహారంపై బుధవారం అదనపు ఫిర్యాదును కూడా దాఖలు చేసింది.
అమెరికా సినిమాలపై చైనాలో నిషేధం
ఇకపై హాలీవుడ్ సినిమాలపై కూడా నిషేధం విధించేందుకు చైనా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇది అమలులోకి వస్తే, హాలీవుడ్ వందలాది కోట్ల డాలర్ల విలువైన చైనా మార్కెట్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. అమెరికా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద సినీ మార్కెట్ అయిన చైనాను కోల్పోతే.. హాలీవుడ్ పరిశ్రమకు ఇది భారీ దెబ్బ అవుతుంది అని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా సేవా రంగ సంస్థలపై ఆంక్షలు, నిషేధాలు విధించబడతాయి. సోయాబీన్ సహా ఇతర అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు.
యురోప్ దేశాల అదనపు టారిఫ్‌లు
బ్రసెల్స్ నివేదిక ప్రకారం.. తమ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన 25 శాతం సుంకాలకు ప్రతిగా యూరోపియన్ యూనియన్ కూడా 2,300 కోట్ల డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇవి దశలవారీగా అమలులోకి వస్తాయి. కొన్ని ఉత్పత్తులపై ఏప్రిల్ 15 నుంచి, మరికొన్నింటిపై మే 15 నుంచి, మిగతావాటిపై డిసెంబర్ 1 నుంచి అమలు చేస్తామని వివరించింది. అయితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలను కుంటే తాము స్వాగితిస్తామని ఈయు ప్రతినిధి తెలిపారు.