Taiwan Semiconductor Trump Investments| అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సృష్టిస్తున్న అలజడికి ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు కనిపిస్తున్నాయి. రష్యాతో మూడేళ్లుగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ ని ఇంతకాలం అమెరికా నుంచి సాయం అందేది. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక.. ఇక సాయం ఉచితం కాదు.. ఆ దేశ ఖనిజాలు బదులుగా కావాలని కోరారు. పైగా ఉక్రెయిన్ ను కాదని రష్యాతో చేతులు కలిపారు. దీంతో ఉక్రెయిన్ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇప్పుడు ఇదే పరిస్థితి చైనా పొరుగునే ఉన్న ద్వీప దేశం తైవాన్ కు పట్టేట్లు కనిపిస్తోంది.
సెమీకండక్టర్ తయారీలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ద్వీప దేశం తైవాన్. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే సెమీకండక్టర్లలో 90 శాతం కంటే ఎక్కువ తైవాన్‌లోనే తయారవుతున్నాయి. మొబైల్ ఫోన్ల నుంచి అత్యాధునిక డ్రోన్ల వరకు ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో ఈ చిప్స్ ఉండాల్సిందే. చిప్స్ రాజ్యంగా తైవాన్ తలపై ఉన్న కిరీటాన్ని తన్నుకుపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద ప్రణాళిక వేశారు.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సంస్థగా పేరుపొందిన తైవాన్ సెమీకండక్టర్ తయారీ కంపెనీ (టీఎస్ఎంసీ)తో అమెరికాలో 100 బిలియన్ డాలర్ల (సుమారు 8.69 లక్షల కోట్ల రూపాయలు) పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదిరింది. ఈ నిధులతో టీఎస్ఎంసీ అమెరికాలో సెమీకండక్టర్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. అంటే సెమీకండక్టర్ల ఉత్పత్తి ఇకపై అమెరికాలోనే జరుగుతుంది. అక్కడి నుంచే విదేశాలకు చిప్స్ ఎగుమతి జరుగుతుంది. ఈ ఆదాయం చాలావరకు అమెరికా ఖాతాలోకి వెళ్లిపోతుంది. అప్పుడు సెమీకండక్టర్ చిప్స్ ఉత్పత్తిలో తైవాన్ ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇదే ఇప్పుడు తైవాన్ రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది.
Also Read: ఇండియాను ఫాలో అవుతున్న ట్రంప్.. అమెరికాలో వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు!
ట్రంప్ తీరుతో జాతీయ భద్రతా సంక్షోభం
తైవాన్ మాజీ అధ్యక్షుడు మా యింగ్-జియూ, ప్రస్తుత అధికార పార్టీ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ)పై తీవ్ర విమర్శలు చేశారు. చైనా బారి నుంచి తైవాన్‌ను కాపాడుతున్నందుకు ట్రంప్ ప్రభుత్వానికి ‘ప్రొటెక్షన్ ఫీజు’ చెల్లిస్తున్నారని డీపీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. టీఎస్ఎంసీని అమెరికాకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం తైవాన్ జాతీయ భద్రతకు సంక్షోభం కలిగిస్తుందని హెచ్చరించారు. అమెరికాలో 8.69 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడాన్ని తప్పుపట్టారు. చిప్స్ తయారీలో తైవాన్ స్థానాన్ని దిగజార్చడం తగదని అన్నారు.
ట్రంప్తో కుదిరిన ఒప్పందం తైవాన్ ప్రజల విశ్వాసాన్ని, ఇతర దేశాలతో సంబంధాలను దెబ్బతీస్తుందని మా యింగ్-జియూ ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాల్లో తైవాన్ హోదా దిగజారుతుందని హెచ్చరించారు. అయితే, అమెరికాలో పెట్టుబడులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తైవాన్ ప్రస్తుత అధ్యక్షుడు లా చింగ్-తే స్పష్టం చేశారు. టీఎస్ఎంసీ విస్తరణ కోసమే ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. దేశ ప్రతిష్టకు ఎలాంటి ముప్పు రాదని ప్రజలకు హామీ ఇచ్చారు.
తైవాన్ పట్ల మారిన అమెరికా స్వరం
తైవాన్‌పై పొరుగు దేశమైన చైనా ఎప్పటి నుంచో కనేసింది. తైవాన్ తమ దేశంలో భాగమేనని, ఏనాటికైనా విలీనం కాక తప్పదని చైనా పట్టుబట్టింది. మరోవైపు, అమెరికా మద్దతుతోనే తైవాన్ స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తోంది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం.. తైవాన్ రక్షణ బాధ్యతను అమెరికా స్వీకరించింది. ఇందుకోసం అమెరికాలో తైవాన్ రిలేషన్స్ యాక్ట్ తీసుకువచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తైవాన్ విషయంలో అమెరికా స్వరం మారింది.
ప్రధానంగా తైవాన్‌కు జీవనాడిగా ఉన్న చిప్స్ తయారీ రంగంపై ట్రంప్ దృష్టి పెట్టారు. తైవాన్ పరిశ్రమను క్రమంగా అమెరికాకు తరలించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తైవాన్ లో రాజకీయ దుమారం రేగింది. తమ దేశాన్ని పీల్చిపిప్పి చేసి.. ఆఖరికి గాలికి వదిలేయాలన్నదే ట్రంప్ ప్లాన్ అని తైవాన్ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తైవాన్ మరో ఉక్రెయిన్ లాగా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నాయి. అమెరికా-తైవాన్ సంబంధాల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ‘ఈ రోజు ఉక్రెయిన్, రేపు తైవాన్’ అనే మాట తైవాన్‌లో తరచుగా వినిపిస్తోంది.