Trump To shutdown Education Department| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యయం తగ్గించడంపై దృష్టి సారించారు. ఈ ప్రక్రియలో భాగంగా విద్యాశాఖలో భారీగా ఉద్యోగాల కోతలు పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఆయన.. ప్రస్తుతం ఈ విభాగాన్నే మూసివేయడానికి అడుగులు వేస్తున్నారు. ఈ దిశగా ఉత్తర్వులు జారీ చేయడానికి అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఉదారవాద భావజాలంతో విద్యాశాఖ కలుషితమైందని ట్రంప్ భావిస్తున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ కథనాలకు బలం చేకూరుస్తూ.. ఇటీవల అమెరికా విద్యాశాఖ మంత్రి ఒక ప్రకటన కూడా చేశారు.
‘‘విద్యాశాఖను మూసివేయడానికి, ఆ శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో అమెరికా ప్రజలకు అందుబాటులో ఉన్న సేవల్లో అంతరాయం లేకుండా చూసుకోవాలి’’ అని విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మాన్‌ను ఉద్దేశిస్తూ వైట్‌హౌస్ ఫ్యాక్ట్‌షీట్‌లో పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు తెలిపాయి. అయితే, అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా విద్యాశాఖను మూసివేయడం దాదాపు అసాధ్యమే.
Also Read: అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీ హత్య వెనుక రహస్యాలు.. బహిర్గతం చేసిన ట్రంప్
పరిశోధకులు, శాస్త్రవేత్తలపై వేలాడుతున్న కత్తి
ఇప్పటికే వేలాది మంది ఫెడరల్, యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై కత్తెర వేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇప్పుడు తన దృష్టిని శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులపై సారించారు. పర్యావరణ పరిరక్షణ సంస్థకు (ఈపీఏ) నిధుల కోతల్లో భాగంగా వందల మంది శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులను తొలగించే ప్రణాళికలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాలుష్యం, నీటి శుద్ధి, వాతావరణ మార్పులు వంటి పర్యావరణ అంశాల్లో 1,500 మంది శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫిబ్రవరిలో ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ సంస్థను పర్యవేక్షించడానికి ఎంపిక చేసిన 17,000 మంది సిబ్బందిలో దాదాపు 65 శాతం మందిని తగ్గించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
సైన్యంలో ట్రాన్స్‌జెండర్ల నిషేధం ఉత్తర్వులపై కోర్టు స్టే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మిలిటరీ సర్వీసుల నియామకాల్లో ట్రాన్స్‌జెండర్లను నిషేధిస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను వాషింగ్టన్ డి.సి.లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అనా రేయస్ మంగళవారం నిలిపివేశారు. ట్రంప్ ఉత్తర్వుులు.. ట్రాన్స్‌జెండర్లకు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును నిరాకరించేలా ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. సృష్టిలోని మానవులంతా సమానం అనే యూఎస్ స్వాతంత్య్ర ప్రకటనను గుర్తు చేశారు. అప్పీల్‌కు వెళ్లేందుకు వీలుగా ఈ తీర్పు అమలును మూడు రోజుల పాటు నిలిపి ఉంచుతున్నట్లు తెలిపారు.
మిలిటరీలో ట్రాన్స్‌జెండర్లను కొనసాగించడం వల్ల అమెరికా సైనిక సన్నద్ధతకు, సైనికుల వ్యక్తిగత గౌరవానికి, క్రమశిక్షణాయుతమైన జీవన శైలికి అవరోధం కలుగుతుందని పేర్కొంటూ జనవరి 27న ట్రంప్ నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని ఆరుగురు ట్రాన్స్‌జెండర్లు న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం… యూఎస్‌ఎయిడ్ ఉద్యోగుల తొలగింపు తదితర అంశాల్లో న్యాయస్థానాల్లో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.