Ukraine Agrees Cease Fire| రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఇక ఈ ఒప్పందాన్ని రష్యా అంగీకరించాల్సి ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఒప్పందానికి అంగీకరిస్తారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఈ మేరకు మాట్లాడిన ట్రంప్.. “ఈ యుద్ధం కారణంగా అనేక మంది ప్రజలు చనిపోతున్నారు. దీన్ని ముగించడానికి కాల్పుల విరమణ చాలా ముఖ్యం.” అని అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మరోసారి చర్చలు జరపడానికి ఆయనను ట్రంప్ వైట్ హౌస్‌కు ఆహ్వానించనున్నారని సమాచారం.
ఇటీవల, సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలోలో అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ప్రతిపాదించగా.. ఉక్రెయిన్ అంగీకరించింది. ఇక, ఈ ఒప్పందాన్ని రష్యాకు అంగీకరింపజేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంతకుముందు యుద్ధం ఆపేయాలని ఉక్రెయిన్‌ని అమెరికా కోరగా అందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు షరతులు విధించారు. దీంతో ఆగ్రహించిన అమెరికా.. యుద్ధంలో ఉక్రయెన్ కు అందే సాయాన్ని నిలిపివేసింది. నిఘా, శాటిలైట్ సాయం కట్ చేసేసింది. ఇప్పడు ఉక్రెయిన్ కాల్పులు విరమణ అంగీకరించడంతో అమెరికా సైనిక సహాయం, నిఘా భాగస్వామ్యంపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
ఉక్రెయిన్ ప్రతినిధుల ప్రకారం.. ఈ చర్చలు నిర్మాణాత్మక ప్రారంభానికి నాంది పలికాయి. ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత ఈ చర్చలు పెద్ద ఉపశమనాన్ని తెచ్చాయని సమావేశంలో పాల్గొన్న ఉక్రెయిన్ ప్రతినిధి ఆండ్రీయ్ యెర్మాక్ పేర్కొన్నారు. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా పాల్గొన్నారు. 2014 తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూమిపై ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో స్పష్టం చేశారు.
Also Read: భారత్ లో అమెరికా మద్యంపై 150 శాతం, వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు.. అందుకే ప్రతీకారం!
మరోవైపు, ఉక్రెయిన్ మంగళవారం రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. రష్యాలోని 10 ప్రాంతాలపై 337 డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిసింది. రష్యా మిలిటరీ ఈ డ్రోన్లను కూల్చివేసిందని ప్రకటించింది. ఈ దాడిలో ఒకరు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ దాడి జెడ్డాలో చర్చలు ప్రారంభించడానికి కొద్ది గంటల ముందు జరిగింది, ఇది గమనార్హం.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా, ఇతర దేశాలు శాంతి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఈ ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన అంశం. ఇక, రష్యా ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుందో లేదో అనేది ఇప్పటికీ అనిశ్చితంగా ఉంది.