Zelenskyy Trump Meeting | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) వైట్ హౌస్‌లో శుక్రవారం భేటీ అయ్యారు. ఉక్రెయిన్ ఖనిజాల ఒప్పందమే ప్రధాన అజెండాగా వీరి భేటి సాగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఇద్దరి మధ్య వేడిగా చర్చగా సాగింది. జెలెన్‌స్కీ ఖనిజాల ఒప్పందానికి, యుద్ధంలో రష్యాతో రాజీపడడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్ ఆయన వార్నింగ్ ఇచ్చారని సమాచారం.
ఈ సందర్భంగా జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. శాంతి చర్చల సమయంలో తమ భూభాగంపై దాడి చేసిన ‘హంతకుడి’ (పుతిన్)తో ఎలాంటి రాజీ ఉండకుండా చూడాలని ట్రంప్‌ను కోరారు. అయితే ట్రంప్ సమాధానమిస్తూ, రష్యాతో సంధి కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్ రాజీ పడాల్సిందేనని చెప్పారు. చర్చలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మీటింగ్ త్వరగా ముగిసిపోయింది. జెలెన్‌స్కీ ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ట్రంప్ కోపంగా జెలెన్‌స్కీ అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపిస్తూ.. మీడియా సమావేశం రద్దు చేశారు. 45 నిమిషాల పాటు సాగిన మీటింగ్ లో జెలెన్‌స్కీ తీరుతో విసిగిపోయిన ట్రంప్ గట్టిగా అరిచారని స్థానిక మీడియా తెలిపింది.
జెలెన్‌స్కీ తమతో డీల్ చేసుకోకుంటే అమెరికా సైనిక సాయం ఆపేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. “ఉక్రెయిన్ వద్ద సైనికులు లేరు. ప్రజలు చనిపోతున్నారు. ఇంతకాలం యుద్ధం సాగినందుకు మీరు (జెలెన్‌స్కీ) కృతజ్నతా భావంతో ఉండాలి. కానీ మీరు అలా వ్యవహరించడం లేదు. ఇది మంచిది కాదు. మీరు ఒప్పుకునే తీరాలి. మీకు వేరే దారి లేదు. అలా చేయకుంటే యుద్ధంతో అమెరికాకు సంబంధం లేదు” అని జెలెన్‌స్కీతో ట్రంప్ చెప్పారు.
జెలెన్‌స్కీపై మాట మార్చిన ట్రంప్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) నియంతలా వ్యవహరిస్తున్నారని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా తాను అలా అనలేదంటూ ట్రంప్ మాట మార్చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ గురువారం ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జెలెన్‌స్కీ నియంత అని గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఓ విలేకరి గుర్తు చేశారు. దీనికి ట్రంప్ బదులిస్తూ, ‘నేను అలా అన్నానా? నేను అలా అన్నాను అంటే నమ్మలేకపోతున్నాను. జెలెన్‌స్కీతో నాకు మంచి సంబంధాలున్నాయి. శనివారం మా ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరుగుతుందని భావిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read: మిత్రదేశాలనూ వదలని ట్రంప్.. యూరోప్ కూటమిపై 25 శాతం సుంకాలు
ఇటీవల ఒక మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. జెలెన్‌స్కీ ఓ నియంత అని, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని ట్రంప్ మండిపడ్డారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తీసుకొచ్చారన్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
ఇదిలాఉండగా, రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య శాంతి నెలకొల్పేందుకు తాము చొరవ తీసుకుంటామని, అందుకు కీవ్‌లోని అరుదైన ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ప్రతిపాదించారు. దీనికి తొలుత అంగీకరించని ఉక్రెయిన్, పలు సవరణల అనంతరం ఆమోదించింది. ఈ క్రమంలో ఈ ఒప్పందాలపై సంతకం చేసేందుకు శుక్రవారం జెలెన్‌స్కీ వాషింగ్టన్ చేరుకున్నారు. ఈ ఒప్పందంపై అంగీకరించడంతో అమెరికా నుంచి సైనిక సాయం ఆగిపోకుండా చూసుకోవచ్చని జెలెన్‌స్కీ ఆశిస్తున్నారు.
ఉక్రెయిన్ భూభాగంలోని చమురు, గ్యాస్, పోర్టులతో పాటు అరుదైన ఖనిజాలు, మౌలిక సదుపాయాలు సహా ఆ దేశంలోని సగభాగం సహజ వనరులు తమకు ఇవ్వాలని అమెరికా కోరింది. అయితే అగ్రరాజ్యం ఉక్రెయిన్ నుంచి కోరుతున్న మొత్తం రెండో ప్రపంచయుద్ధం తర్వాత జర్మనీ, జపాన్‌లపై విధించిన ఆంక్షల కంటే ఎక్కువని బ్రిటన్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ఈ ఒప్పందం కుదిరితే.. ఉక్రెయిన్‌లో భవిష్యత్ పెట్టుబడి ప్రాజెక్టుల నిబంధనలను నిర్ణయించడంలో అమెరికా పెత్తనం చెలాయించే అవకాశం ఉన్నట్లు ఓ ప్రముఖ బ్రిటన్ వార్తా పత్రిక తెలిపింది. ఎలా చూసినా, ఈ ఒప్పంద వల్ల అమెరికాకే ఎక్కువ మేలు చేకూరుతుంది.