US Bangladesh Hindu Attacks| ఇండియా పొరుగు దేశం బంగ్లాదేశ్ లో గత కొన్ని నెలలుగా హిందువులపై జరుగుతున్న దాడుల ఘటనపై అమెరికా, ఐక్యారాజ్య సమితి సీరియస్ గా ఉన్నాయి. ఇటీవలే ఐక్యరాజ్య సమితి జాతీయ భద్రతా సలహాదారుడు (నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్) ఎన్ఎస్‌ఏ జేక్ సుల్లివాన్ .. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ముహమ్మద్ యూనుస్ తో ఫోన్ లో చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. పరిస్థితులను అదుపుచేయాలని యూనుస్ కు జేక్ సుల్లివాన్ సూచించారు.
ఈ మేరకు అమెరికా ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ” బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధి ముహమ్మద్ యూనుస్ తో ఐక్యరాజ్యసమితి జాతీయ సలహాదారుడు జేక్ సుల్లివాన్ చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ అన్ని మతాల ప్రజల మానవ హక్కులు పరిరక్షించాలని యూనుస్ కు సూచించారు. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం ఉంటేనే అమెరికా మద్దతు బంగ్లాదేశ్ కు ఉంటుంది. బంగ్లాదేశ్ లో రాజకీయ స్థిరత్వం కోసం ఇప్పుడు సత్వరంగా చేపట్టాలి. సంక్షోభ సమయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం అమెరికా తప్పకుండా తోడుగా నిలబడుతుంది. అయితే మైనారిటీలపై దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలు నిలువరించాలి. అప్పుడే బంగ్లాదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుంది.” అని అమెరికా ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.
బంగ్లాదేశ్ లో కొన్ని నెలల క్రితం ప్రధాన మంత్రి షేక్ హసీనాని గద్దె దించిన తరువాత అక్కడ విద్యార్థి నిరసన కారులు, ప్రతిపక్ష పార్టీ.. మిలిటరీ అండదండలతో దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు, హిందువుల ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నాయి.
మరోవైపు అగ్రరాజ్యం అమెరికా తుదపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గా ఎన్నికల్లో విజయం సాధించారు. జనవరి 20, 2025న డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ట్రంప్ ఖండించారు. అమెరికా ప్రభుత్వం బంగ్లాదేశ్ ఘటనలపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.
దీంతో డిసెంబర్ 13, 2024న అమెరికా ప్రభుత్వం ఈ అంశంపై తొలిసారిగా స్పందించింది. “బంగ్లాదేశ్ పరిస్థితులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు తెలియజేస్తున్నాం. ఆ దేశంలో మైనారిటీ మతాల ప్రజలపై దాడులకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే.” అని ఒక ప్రకటన జారీ చేసింది.
ఆ తరువాత అమెరికాలో డెమోక్రాటిక్ కాంగ్రెస్ మెన్ శ్రీ థానెదార్ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో హిందువులపై జరగుతున్న దాడుల ఘటనలపై అమెరికా ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఈ అంశంపై నిలదీయాలని ఆయన సూచించారు.
“ప్రపంచంలో ఏ దేశంలోనైనా అణచివేతకు గురయ్యే ప్రజల హక్కుల పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉంది. బంగ్లాదేశ్ లో కూడా ఇదే విధానాన్నే కొనసాగించాలి. ఆ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. అక్కడి ప్రజలు అమెరికా నుంచి సాయం కోరుతున్నారు. ఈ అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రతినిధితో అమెరికా చర్చలు జరిపి.. అక్కడ శాంతి, సమానత్వం నెలకొల్పేందుకు ప్రయత్నించాలి” అని భారత మూలాలున్న శ్రీ థానెదార్ గత వారం మీడియా సమావేశంలో అన్నారు.