US Funds For India Elections | భారత ఎన్నికల్లో, అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం ఉందని తేలిపోయింది. దీనికి సంబంధించి ఆధారాలు లభించాయి. తాజాగా ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం విభాగం డోజె (డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ – DOGE) అనవసర ఖర్చుల తగ్గించుకునేందుకు ప్రభుత్వ నిధుల్లో కోత విధించింది. ఈ ప్రక్రియలో భాగంగానే అమెరికా గత ప్రభుత్వం భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు 21 మిలియన్ డాలర్లు కేటాయించినట్లు తేలింది.
ప్రపంచ దేశాల ఎన్నికల్లో అధిక శాతం పోలింగ్ జరిగేందుకు ఓటర్లను ప్రభావితం చేసేందుకు జో బైడెన్ ప్రభుత్వం మొత్తం 486 మిలియన్ డాలర్లు కేటాయించిందని .. ఇందుకోసం అమెరికాలో కన్జార్షియం ఫర్ ఎలెక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంగ్తెనింగ్ కార్యక్రమం అమలులో ఉందని ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వ ఏర్పాటు చేసిన డోజె విభాగం తెలిపింది. ఈ 486 మిలియన్ డాలర్ల్ బడ్జెట్ లో ఇండియా ఎన్నికల కోసం 21 మిలియన్ డాలర్లు కేటాయించినట్లు డోజె వెల్లడించింది. ఈ మొత్తం కేటాయింపులను డోజె విభాగం రద్దు చేసింది.
ఇదే కాకుండా మరో 29 మిలియన్ డాలర్లు ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉన్న భారత పొరుగు దేశం బంగ్లాదేశ్ లో రాజకీయ స్థిరత్వం కోసం కేటాయిచింది. అయితే బంగ్లాదేశ్ లో మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాను గద్దె దించడానకి అమెరికా కుట్ర చేసిందనే ఆరోపణలు కూడా ఉండడం గమనార్హం.
Also Read: అమెరికా వీసా రూల్స్‌లో మార్పులు.. కఠినతరం చేసిన ట్రంప్ ప్రభుత్వం!
బైడెన్ ప్రభుత్వం ఈ నిధులన్నీ అమెరికా ప్రజల నుంచి పన్నుల రూపంలో సంపాదించినవే నని ఎలాన్ మస్క్ నాయకత్వంలోని డోజె తెలిపింది. ఇతర దేశాల రాజకీయ వ్యవహారంలో ప్రభావితం చేసేందుకు అమెరికా కేటాయించిన నిధుల జాబితాలో ప్రేగ్ దేశం సివిల్ సొసైటీ సెంటర్ కోసం 32 మిలియన్లు, మోల్డోవా కోసం 22 మిలియన్ డాలర్లు, నేపాల్ కోసం ఏకంగా 39 మిలియన్ డాలర్లు, మాలి దేశంలో సామాజికాభివృద్ధి పేరుతో 14 మిలియన్లు, సెర్బియా కోసం 14 మిలియన్లు ప్రముఖంగా ఉన్నాయి.
ఈ ఖర్చులన్నీ వృథాగా భావించి నిధుల కేటాయింపును మస్క్ డోజె రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ వార్త బహిర్గతం కావడంతో భారతదేశంలోని అధికార పార్టీ బిజేపీ మండిపడింది. విదేశీ శక్తులు ఇండియా ఎన్నికలను ప్రభావితం చేస్తున్నట్లు నిరూపితమైందని బిజేపీ జాతీయ ప్రతినిధి అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “21 మిలియన్ డాలర్లు భారత ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ కోసమా?.. దీని వల్ల ఎవరికి లాభం? కచ్చితంగా అధికార పార్టీకైతే కాదు. ” అని మాల్వీయా వ్యాఖ్యానించారు. అమెరికా బిలియనీర్ జార్జి సోరోస్ దీనంతటి వెనుక ఉన్నాడని ఆయన ఆరోపణలు చేశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో, గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని విమర్శించారు.
2012లో భారతదేశంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్నికల కమిషన్.. అంతర్జాతీయ సంస్థ అయిన ఇంటర్నేష్నల్ ఫౌండేషన్ ఫర్ ఎలెక్టోరల్ సిస్టమ్స్ తో ఒప్పందం కుదుర్చుకుందని.. ఈ అంతర్జాతీయ సంస్థ ప్రత్యక్షంగా సోరోస్ సామాజిక సంస్థతో సంబంధాలు కలిగి ఉందని.. దీనంతటికీ అమెరికా నిధులు సమకూరుస్తోందని మాల్వియా చెప్పారు.