US Foreign Students Deport| అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. చిన్నచిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలను కారణంగా చూపి అనేక మంది విద్యార్థులకు బహిష్కరణ నోటీసులు జారీ చేయడం జరుగుతోంది. ఇతర కేసులలో నిర్దోషులుగా న్యాయస్థానాల ద్వారా విడుదల అయినవారిని కూడా అమెరికా వదిలి వెళ్లమని అధికారులు ఆదేశిస్తున్నారు. ఈ విధానంతో అనేక భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల ఒక భారతీయ విద్యార్థి తనకు సంబంధం లేని కేసులో చిక్కుకున్నాడు. న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసినప్పటికీ, అధికారులు అతడిని “మునుపటి నేరస్తుడు” అని పేర్కొని బహిష్కరించారు. ఆ విద్యార్థి సెవీస్ (SEVIS) రికార్డును తొలగించడంతో, అతను తప్పనిసరిగా అమెరికా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాలు అనేకమంది భారతీయ విద్యార్థులకు ఎదురవుతున్నాయి.
సెవీస్ సిస్టమ్ ప్రభావం
అమెరికాలో సెవీస్ (SEVIS) అనేది ఒక డేటా సిస్టమ్. ఇందులో విదేశీ విద్యార్థుల డేటాను నమోదు చేస్తారు. ఒక విద్యార్థి సెవీస్ రికార్డు తొలగించబడితే, అతను అమెరికాలో ఉండటానికి అనర్హుడవుతాడు. అటువంటి సందర్భాలలో విద్యార్థికి రెండు మార్గాలు మాత్రమే ఉంటాయి.
తన రికార్డును పునరుద్ధరించుకోవడానికి న్యాయపోరాటం చేయడం లేదా 15 రోజుల్లో అమెరికా వదిలి వెళ్లడం. ఈ విధానాలు ఎఫ్-1 (విద్యార్థి వీసా), ఎం-1 (వృత్తిపర శిక్షణ వీసా), జే-1 (ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వీసా) వీసా కలిగిన వారందరికీ వర్తిస్తాయి.
Also Read: అమెరికాపై సుంకాల మోత.. ట్రంప్‌పై ముప్పేట దాడి చేసిన కెనడా, ఈయు, చైనా
పాత కేసులను సాకుగా చూపిస్తూ
అమెరికన్ అధికారులు ఇప్పుడు పాత కేసులను తిరిగి తెరుస్తున్నారు. ఉదాహరణకు లెర్నర్ డ్రైవింగ్ లైసెన్సుతో కారు నడిపిన విద్యార్థులను ఇప్పుడు బహిష్కరిస్తున్నారు. సంవత్సరాల క్రితం ముగిసిన గృహహింస కేసులను ఇప్పుడు డిపోర్టేషన్‌కు కారణాలుగా ఉపయోగిస్తున్నారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా దాన్ని పరిగణించడం లేదు.
కారణం లేకుండా వీసాలు రద్దు చేయడం
ఇటీవల డార్ట్మౌత్ కాలేజీలో పీహెచ్‌డీ చదువుతున్న ఒక చైనా విద్యార్థి వీసా హఠాత్తుగా రద్దు చేయబడింది. అతను ఎలాంటి నేరం చేయకపోయినా, ఎలాంటి ఆందోళనలో పాల్గొనకపోయినా అతని విద్యాభ్యాసం ఇప్పుడు ఆగిపోయింది. అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలతో తమ భవిష్యత్తు ఏమిటని విదేశీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చినవారు ఇప్పుడు నిరాశకు గురవుతున్నారు. ట్రంప్ యంత్రాంగం విధానాలు ఇప్పుడు అమెరికా విద్యావ్యవస్థపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
అమెరికా వీసా, గ్రీన్‌కార్డు దారులకు ట్రంప్ షాక్
విదేశీ విద్యార్థల పట్ల మాత్రమే కాదు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి పట్ల కూడా ప్రెసిడెంట్ ట్రంప్ కఠినమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టినా వారి వీసాలను రద్దు చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా హమాస్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలిపే పోస్ట్‌లు, కామెంట్లు ఉంటే వీసా/గ్రీన్ కార్డును రద్దు చేయడం జరుగుతుంది. ఇప్పటికే 300కుపైగా వీసాలు రద్దు చేశారు.