USA Indian Deportation List | అక్రమ వలసదారులను తరలించే ప్రక్రియను తీవ్రంగా కొనసాగిస్తున్న అమెరికా (USA).. 104 మంది భారతీయులను తిరిగి భారతదేశానికి పంపించిన (US Deportation) విషయం తెలిసిందే. ఈ క్రమంలో, అమెరికా బహిష్కరణ తుది జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం భారత్‌కు తెలియజేసినట్లు పేర్కొంది.
వలసదారులను సంకెళ్లు వేసి తరలిస్తున్నారనే ఆరోపణలపై స్పందిస్తూ.. ఈ విషయంలో తమ ఆందోళనను అమెరికాకు తెలియజేశామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతామని ఆయన అన్నారు. అక్రమంగా అమెరికా వెళ్లినట్లు గుర్తించిన భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకువస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
Also Read: అమెరికాలో దొంగచాటుగా ఈ మార్గంలోనే ప్రవేశం.. అక్రమ వలసదారులు ఎంత నరకం అనుభవిస్తారంటే..
సైనిక విమానాల్లో తరలించే ప్రక్రియపై మిస్రీ స్పందిస్తూ.. ఈ తాజా బహిష్కరణ ప్రక్రియ మునుపటి విమానాలతో పోలిస్తే భిన్నంగా ఉందని తెలిపారు. అయితే, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అమెరికా ప్రభుత్వ విధానంలోనే పేర్కొన్న ఈ సందర్భంగా విషయాన్ని గుర్తుచేశారు.
ఇప్పటివరకు 15 వేల మంది భారతీయులను తిరిగి పంపిన అమెరికా..
అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించే ప్రక్రియ (Deportation) కొత్తదేమీ కాదని భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. గత 15 ఏళ్లలో 15,756 మంది భారతీయులను తిరిగి పంపించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తెలిపారు. 2009లో ఈ సంఖ్య 734గా ఉండగా, 2019లో గరిష్ఠంగా 2,042 మందిని తిరిగి పంపించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన వలసదారుల సంఖ్య ఇలా ఉంది:
2009లో: 734 మంది , 2010లో: 799 మంది, 2011లో: 597 మంది, 2012లో: 530 మంది, 2013లో: 515 మంది, 2014లో: 591 మంది, 2015లో: 708 మంది, 2018లో: 1,180 మంది, 2019లో: 2,042 మంది, 2020లో: 1,889 మంది , 2021లో: 805 మంది, 2022లో: 862 మంది, 2023లో: 617 మంది, 2024లో: 1,368 మంది, 2025లో ఇప్పటివరకు 104 మందిని పంపినట్లు విదేశాంగ మంత్రి వెల్లడించారు.
భారత్‌కు 104 మంది వలసదారుల తరలింపు.. అమెరికాకు ఖర్చు ఎంతంటే..?
ఇటీవల కొంతమంది భారతీయులను (Indian Migrants) తిరిగి పంపిన అమెరికా, ఈ ప్రక్రియకు ఎంత ఖర్చు చేసిందో తెలుసా..? 104 మంది వలసదారులను భారత్‌కు పంపించేందుకు అమెరికా 1 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు (Cost for Deportation) చేసిందని అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 8.74 కోట్లకు పైగా ఉంది. సాధారణంగా పౌర విమానాలతో పోలిస్తే, సైనిక విమానాల నిర్వహణ ఖర్చు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని నివేదికలు తెలిపాయి.
అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17ఏ గ్లోబ్‌మాస్టర్ 3 విమానం గత బుధవారం అక్రమ వలసదారులను తీసుకొని పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో దిగింది. ఈ విమానాన్ని 1995లో అమెరికా వాయుసేనలో చేర్చారు. అప్పటి నుంచి వాహనాలు, సైనిక బలగాలు, ఆయుధ సామగ్రి తరలింపునకు ఈ సైనిక విమానాలను ఉపయోగిస్తున్నారు. ఈ విమానాలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా చేపట్టిన అనేక సైనిక ఆపరేషన్లలో ఉపయోగించబడ్డాయి.
అక్రమ వలసదారుల తరలింపునకు గతంలోఅమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కమర్షియల్ ఛార్టర్ విమానాలను ఉపయోగించేది. 2021 నాటి గణాంకాల ప్రకారం, ఆ ఛార్టర్ విమానాల ఖర్చు గంటకు 8,577 డాలర్లు (దాదాపు రూ. 7.50 లక్షలు)గా ఉండేది. అయితే, ఇప్పుడు ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చిన తర్వాత, అక్రమ వలసదారుల తరలింపు కోసం తొలిసారిగా సైనిక విమానాలను ఉపయోగిస్తున్నారు.
యూఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ డేటా ప్రకారం, ఒక్కో సీ-17 మిలిటరీ విమానం రవాణా నిర్వహణ ఖర్చు గంటకు 28,562 డాలర్లు (దాదాపు రూ. 24.98 లక్షల పైగా)గా ఉంది. కమర్షియల్ విమానాల మాదిరిగా కాకుండా, సైనిక విమానాలు భిన్నమైన మార్గాల్లో ప్రయాణిస్తాయి. ఇతర దేశాల్లో గగనతల నిబంధనలు, మిలిటరీ బేస్‌ల్లో ఇంధనం నింపుకోవడం వంటి కారణాలతో ఈ విమానాల ప్రయాణ మార్గాలు వేర్వేరుగా ఉంటాయి.
అందుకే అమెరికా నుంచి బయల్దేరిన భారత వలసదారుల విమానం దాదాపు 43 గంటల తర్వాత ఇండియాలోని అమృత్‌సర్ కు చేరుకుంది. ఈ గణాంకాలను బట్టి, విమానం తిరుగు ప్రయాణాన్ని కూడా కలుపుకుంటే, వలసదారుల తరలింపునకు మొత్తంగా 1 మిలియన్ డాలర్ల పైగా ఖర్చు అయినట్లు నివేదికలు వివరించాయి. అంటే, ఒక్కో వలసదారుడిపై 10 వేల డాలర్లకు (రూ. 8.74 లక్షలు) పైగా అమెరికా ఖర్చు చేసింది.