BigTV English

Modi Japan Tour: మోదీ జపాన్ పర్యటన ద్వారా భారత్ కి కలిగే లాభం ఇదే..

Modi Japan Tour: మోదీ జపాన్ పర్యటన ద్వారా భారత్ కి కలిగే లాభం ఇదే..

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల జపాన్ పర్యటన ముగిసింది. అమెరికా సుంకాల మోత మోగిస్తున్న వేళ, ప్రధాని విదేశీ పర్యటనలన్నీ ఆసక్తికరంగానే సాగుతున్నాయి. అమెరికాకు ప్రత్యామ్నాయ అవకాశాలను వెదుక్కుంటూ భారత్ తో వివిధ దేశాల వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకుంటూ ఈ ప్రయత్నం జరుగుతోంది. తాజాగా జపాన్ పర్యటనలో కూడా అదే జరిగినట్టు తెలుస్తోంది. భారత ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా తన జపాన్‌ పర్యటన జరిగిందని మోదీ స్వయంగా ట్విట్టర్లో ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా జపాన్ ప్రదాని ఇషిబాకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ.


13 ఒప్పందాలు..
మోదీ జపాన్ పర్యటనలో భారత్‌- జపాన్‌ మధ్య దాదాపు 13 ఒప్పందాలు ఖరారయ్యాయి. రాబోయే పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది. సెమీకండక్టర్లు, క్లీన్‌ ఎనర్జీ, టెలికాం, ఖనిజాల సరఫరా, సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడంలో ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. 13 ఒప్పందాలలో ఆరు డైరెక్ట్ అగ్రిమెంట్లు ఉండగా, ఏడు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఇక ఇరు దేశాల ప్రధానులు 8 కొత్త ప్రకటనలు చేశారు.

బుల్లెట్ రైలు ప్రయాణం..
జపాన్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలసి బుల్లెట్ రైలులో టోక్యో నుండి సెండాయ్‌కు ప్రయాణించారు. టోక్యోలోని 16 జపనీస్ ప్రిఫెక్చర్‌ల గవర్నర్‌లను మోదీ కలిశారు. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో బలమైన స్టేట్ ప్రిఫెక్చర్ సహకారం కోసం పిలుపునివ్వడం విశేషం. అనంతరం భారతదేశం-జపాన్ ఆర్థిక వేదికను ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం ఇచ్చారు. జపాన్ లో తయారీ, సాంకేతికత, ఆవిష్కరణ, గ్రీన్ ఎనర్జీ, నైపుణ్య అభివృద్ధి రంగాలలో భాగస్వామ్యం కోసం మోదీ పిలుపునిచ్చారు.

సోలార్ సెల్స్, గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భారత్-జపాన్ భాగస్వామ్యానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని మోదీ తెలిపారు. జాయింట్ క్రెడిట్ మెకానిజంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిని సద్వినియోగం చేసుకుని, స్వచ్ఛమైన, ఆకుపచ్చని భవిష్యత్తుని నిర్మించుకుందామని మోదీ పిలుపునిచ్చారు. టోక్యోలో జపాన్ మాజీ ప్రధానులు యోషిహిదే సుగా, ఫ్యూమియో కిషిదాలను కూడా మోదీ కలవడం విశేషం. జపాన్ మాజీ ప్రధాని యోషిహిదే సుగా.. జపాన్-ఇండియా అసోసియేషన్ కు చైర్‌పర్సన్ గా కూడా ఉన్నారు. భారతదేశం-జపాన్ సహకారం యొక్క అనేక పార్శ్వాల గురించి మోదీ, సుగా చర్చించారు. సాంకేతికత, AI, వాణిజ్యం, పెట్టుబడితోపాటు రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని ఎలా నిర్మించాలో చర్చించినట్టు తెలిపారు మోదీ. జపాన్ పర్యటన అనంతరం మోదీ చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

అమెరికాతో వాణిజ్య సంబంధాలకు ఇబ్బందులు తలెత్తుతున్న వేళ, ప్రధాని మోదీ జపాన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. అమెరికాకు చెక్ పెట్టేందుకు మన విదేశీ సంబంధాలను మరింత మెరుగు పరచుకోవాల్సిన సమయం ఇది. ఈ దశలో భారత్ కు ఇతర దేశాలనుంచి సహకారం లభిస్తున్నట్టుగా పరిస్థితులు కనపడుతున్నాయి. చైనా, జపాన్, ఆస్ట్రేలియా, రష్యాతో భారత్ సత్సంబంధాలను మెరుగు పరుచుకోవాల్సి ఉంది. అదే సమయంలో వాణిజ్య సంబంధాలను బలపరచుకుంటే, అమెరికా సుంకాల బెదిరింపులకు భారత్ లొంగాల్సిన అవసరం ఉండదనే చెప్పాలి.

Related News

Trump Is Dead: ‘ట్రంప్ ఈజ్ డెడ్’ మోత మోగిపోతున్న సోషల్ మీడియా

Trump Tariffs: సుంకాలు చట్టవిరుద్ధం.. ట్రంప్‌కు దిమ్మతిరిగే దెబ్బ

Australia Support: డెడ్ ఎకానమీ కాదు, అద్భుత అవకాశాల గని.. భారత్ కి ఆస్ట్రేలియా బాసట

Ukraine vs Russia: ట్రంప్ శాంతి ప్రయత్నాలు విఫలమా? రష్యా డ్రోన్ దాడితో మునిగిన ఉక్రెయిన్ నౌక

Fighter Jet Crashes: కూలిన ఎఫ్-16 యుద్ధ విమానం.. స్పాట్‌లోనే పైలట్ మృతి

Big Stories

×