BigTV English

World Population Decline : ప్రపంచ జనాభా తగ్గుతోంది.. మరో 100 సంవత్సరాల్లో 20-50శాతం తగ్గుదల!

World Population Decline : ప్రపంచ జనాభా తగ్గుతోంది.. మరో 100 సంవత్సరాల్లో 20-50శాతం తగ్గుదల!

World Population Decline | ఇటు జనాభా క్షీణిస్తోంది. అటు వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రపంచలో దాదాపు అన్ని దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెళ్లికి, పిల్లలను కనేందుకు యువతరం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కాస్త అటూ ఇటుగా ప్రపంచమంతటా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఫలితంగా, చాలా దేశాల్లో జనాభా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు జనాభా తగ్గిపోతుండడంతో ఆందోళన చెందుతున్నాయి.


జనాభా క్షీణత – గణాంకాలు
2024లో చైనా జనాభా 10.4 లక్షలు తగ్గింది. జనాభా తగ్గిపోయినట్లు అక్కడ వరుసగా మూడో ఏడాది నమోదైంది. జపాన్‌లో 15 ఏళ్లుగా జనాభా తగ్గిపోతూనే ఉంది. ప్రపంచంలోని మూడింట రెండొంతుల జనాభా నివసిస్తున్న దేశాల్లో సగటు జనన రేటు (2.1) కంటే తక్కువగా ఉంది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) నివేదిక ప్రకారం, ఈ పరిస్థితి కొనసాగితే అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా 20 నుంచి 50 శాతం తగ్గిపోతుంది.

1997లో ప్రపంచ జనాభాలో వృద్ధులు 12 శాతం ఉన్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 25 శాతానికి చేరనుంది. వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో యువత సంఖ్య తగ్గిపోతోంది. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో తీవ్ర సమస్యగా మారింది. మరో 60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1000 కోట్లకు పెరుగుతుందని.. ఆ తరువాత క్రమంగా క్షీణిస్తుందని ఐరాస నివేదిక ద్వారా తెలుస్తోంది.


చైనాలో పరిస్థితి
చైనాలో 2022 నుంచి జనాభా తగ్గడం ప్రారంభమైంది. అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనా పేరున రికార్డు 2023లో భారత్‌ కైవసం చేసుకుంది. దీంతో చైనా ప్రభుత్వం ఒకే సంతానం నిబంధనను సడలించి ముగ్గురు పిల్లలు కనేందుకు అనుమతించింది. కానీ ఎటువంటి ఫలితం దక్కలేదు. రిటైర్మెంట్ వయసును పెంచి, పిల్లల కోసం ప్రోత్సాహకాలు ప్రకటించినా యువత పెద్దగా ఆసక్తి చూపలేదు. 2050 నాటికి చైనా జనాభా 140 కోట్ల నుండి 130 కోట్లకు తగ్గిపోతుందని అంచనా.

ఇటలీలో సంక్షోభం
ఇటలీలో జనాభా తగ్గుదల తీవ్రంగా ఉంది. 2023లో జననాల సంఖ్య 3.8 లక్షలకు పడిపోయింది. ఇది ఇటలీ ఏకీకరణ తర్వాత మొదటిసారి ఈ స్థాయిలో తగ్గుదల. పిల్లల పెంపకం ఖరీదైన వ్యవహారంగా మారడంతో పాటు తక్కువ జీతాలు, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ భారంగా మారడం వంటి అంశాలు జనాభా తగ్గుదలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఎక్కువ మంది పిల్లలను కనాల్సిందిగా క్రైస్తవుల మతగురువు పోప్‌ ఇటీవలే ఇటాలియన్లకు విజ్ఞప్తి చేశారు.

దక్షిణ కొరియా పరిస్థితి
దక్షిణ కొరియాలో 2023లో జనాభా సంఖ్యలో కాస్త మెరుగుదల కనిపించినా, 2024లో మళ్లీ జనాభా తగ్గింది. అధిక పోటీ విద్యా విధానం, పిల్లల పెంపకం ఖర్చు, మహిళలపై శిశు సంరక్షణ బాధ్యతల కారణంగా యువత పిల్లలు కనేందుకు ఆసక్తి చూపడం లేదు.

Also Read: ప్రియురాలి కోసం అక్రమంగా పాకిస్తాన్ వెళ్లిన భారతీయుడు.. మోసం చేసిన యువతి..కానీ..

జపాన్‌లో సంక్షోభం
జపాన్‌లో 2008లో జనాభా 12.8 కోట్లుండగా, ప్రస్తుతం 12.5 కోట్లకు తగ్గింది. 2070 నాటికి జనాభా 8.7 కోట్లకు తగ్గిపోతుందని అంచనా. కార్పొరేట్ సంస్కృతి, తగిన వేతనాలు లేకపోవడం వంటి అంశాలు సమస్యను మరింత పెంచుతున్నాయి. ప్రతి 10 మందిలో నలుగురు వృద్ధులు ఉండడం జపాన్‌ను మరింత సంక్లిష్టంగా మారింది. జపాన్ ప్రభుత్వం కూడా యువత ఎక్కువ మంది పిల్లలు కనేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు, ఆఫీసులకు సెలవు దినాలు కూడా ఎక్కువగా తీసుకునే సౌలభ్యం కూడా కల్పిస్తోంది.

రష్యా, అమెరికాలో
రష్యా దేశంలో అయితే అధ్యక్షుడు పుతిన్ ప్రజలకు ఎక్కువ మంది పిల్లలు కనాలని.. ఒక్కో మహిళ కనీసం నలుగురు సంతానం కనాలని చెప్పారు. అమెరికాలో ఇటీవలే ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీ వాన్స్ కూడా అమెరికా దంపతులు ఎక్కువ మంది పిల్లలు కనాలని చెప్పారు.

జనాభా తగ్గుముఖం సమస్యతో అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు ప్రపంచం మొత్తానికీ మేల్కొలుపుగా మారాయి. యువతలో పిల్లలను కనేందుకు ఆసక్తి పెంచే చర్యలపై అన్ని దేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×