TGSRTC Protest: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, ఇతర సమస్యలపై కార్మికులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నవారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తంచేశారు. ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే సోమవారం సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఆర్టీసీలో విద్యుత్ బస్సుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు డిపోలను విద్యుత్ బస్సులు సమకూరుస్తున్న సంస్థలకే అప్పగించారు. దీని వల్ల ఆర్టీసీ కార్మికుల్ని ఇతర డిపోలకు మారుస్తున్నారు.
ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు పనిభారం పెరిగిందని జేఏసీ నేతలు చెబుతున్నారు. పనిభారం, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సమ్మె తప్ప మరో మార్గం కనిపించడం లేదని జేఏసీ నేతలు వెల్లడించారు.
ఈ విషయంపై సోమవారం సాయంత్రం TSRTC ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో RTC ఏండీకి సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం రాకపోతే మార్చి మొదటి వారం నుంచి సమ్మె చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: కమిషనర్ దూకుడు.. బెంబెలెత్తున్న అధికారులు, త్వరలో విచారణ
కార్మికుల సమస్యలపై చర్చలు జరుపుతామని.. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కె.కేశవరావుకు ఎస్‌డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తానని కేకే భరోసా ఇచ్చారని రాజిరెడ్డి తెలిపారు.