Bangladesh Against India | దశాబ్దాల స్నేహ సంబంధాలకు బంగ్లాదేశ్ ముగింపు పలుకుతున్నట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యోమంలో కీలక పాత్ర పోషించిన భారతదేశాన్ని బంగ్లా కొత్త ప్రభుత్వం ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తోంది. అంతేకాదు భావితరాలకు కూడా భారత్ పట్ల కృతగ్నతా భావం లేకుండా చేసేందుకు కుట్ర చేస్తోంది. దీని కోసం రానున్న విద్యా సంవత్సరానికి గాను పాఠశాల విద్య పాఠ్యాంశాల్లో కీలక మార్పులు చేసింది.
బంగ్లాదేశ్ నేషనల్ కరికులమ్ అండ్ టెక్స్ట్‌బుక్ బోర్డు.. అన్ని పాఠ్య పుస్తకాల్లో నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనా అనే పేరును పూర్తిగా తొలగించింది. దీంతో పాటు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) చిత్రాలను కూడా తొలగించడం చర్చనీయాంశమైంది. అంతేకాక, బంగ్లా (Bangladesh) స్వాతంత్ర్య ఉద్యమంలో భారత్ పాత్రను తగ్గిస్తూ కొత్త పుస్తకాల్లో మార్పులు చేయడం గమనార్హం. (India Role in Bangla Independence)
1972 సంఘటనలు తొలగించడం:
1972 ఫిబ్రవరి 6న కోల్‌కతా నగరంలో జరిగిన ర్యాలీలో అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ, బంగ్లాదేశ్ ప్రధాని ముజిబుర్ రెహమాన్ పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఇందిర గాంధీ బంగ్లా రాజధాని ఢాకాలో పర్యటించారు. ఇప్పటివరకు చరిత్ర పుస్తకాల్లో ఈ రెండు సంఘటనలకు సంబంధించి ఫొటోలు ఉండగా… సవరించిన పాఠ్యాంశాల్లో వీటిని తొలగించేశారు. అయితే 1971 నాటి యుద్ధంలో భారత ఆర్మీ, బంగ్లా ప్రజా ముక్తివాహిని ఉద్యమ సంస్థ పాల్గొన్న అంశాలు.. అదే సంవత్సరం డిసెంబరు 16వ తేదీన పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన దృశ్యాలను కొత్త సిలబస్‌లో కొనసాగించారు.
Also Read: రక్త పరీక్షతో మీరు ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.. ఎలాగంటే..
బంగ్లాదేశ్ స్వాతంత్య్రంలో భారత్ పాత్ర:
గత పాఠ్య పుస్తకాల్లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం చరిత్ర చూస్తే.. ఆ దేశానికి స్వాతంత్య్రం రావడానికి భారత్ కారణమంటూ చరిత్రలో ఉంది. తాజా సవరణల్లో ఈ అంశాన్ని మార్చారు. తొలుత భూటాన్ తమకు సాయం చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు అన్ని పాఠ్యపుస్తకాల వెనక పేజీలో మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) సందేశం ఉండగా… కొత్త పుస్తకాల్లో దాన్ని తొలగించారు. ఆమె తండ్రి రెహమాన్ నాయకత్వాన్ని కీర్తిస్తూ రాసిన అంశాలను కూడా తగ్గించారు. దాని స్థానంలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఇతర రాజకీయ నేతల ప్రస్తావనను చేర్చారు.
కొత్త పాఠ్యపుస్తకాల ముద్రణ
ప్రైమరీ, సెకండరీ, ఉన్నత విద్యకు సంబంధించిన మొత్తం 441 పుస్తకాల్లో యూనుస్ ప్రభుత్వం చేసిన తాజా సవరణలతో మార్పులు చేసి ముద్రించాల్సి వస్తుంది. 2025 విద్యా సంవత్సరానికి గాను 40 కోట్లకు పైగా కొత్త పుస్తకాలు ముద్రించనున్నట్లు బంగ్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై ఎన్‌సీటీబీ (నేషనల్ కరికలమ్ టెక్స్‌ట్ బుక్ బోర్డ్) ఛైర్‌పర్సన్ రీజుల్ హసన్ మాట్లాడుతూ… భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేస్తామని.. 2012 కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారమే సవరణలు చేసినట్లు తెలిపారు.
షేక్ హసీనా రాజీనామా.. బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 5న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితి ఉండడంతో నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.