Zelenskyy Agrees With Trump| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి స్పందించారు. ఈ పరిణామం తీవ్ర విచారకరమని అన్నారు. ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం ట్రంప్ బలమైన నాయకత్వంలో పనిచేసేందుకు తనతో పాటు తన బృందం సిద్ధంగా ఉందన్నారు. కీవ్కు అందించే సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే జెలెన్‌స్కీ నుంచి ఈ స్పందన వచ్చింది.
యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. కాల్పుల విరమణ తొలిదశలో భాగంగా ఖైదీల విడుదలతో పాటు దీర్ఘ శ్రేణి డ్రోన్లు, ఇంధన వనరులు, క్షిపణులు, ఇతర మౌలిక సదుపాయాలపై బాంబు దాడుల చేయకుండా నిషేధం విధించడానికి రష్యా అంగీకరిస్తే ఆ తరువాత దశల వారీగా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామన్నారు. బలమైన శాశ్వత ఒప్పందం కోసం అమెరికాతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
100 కోట్ల డాలర్ల ఆయుధాల సరఫరా నిలిపివేసిన అమెరికా
ట్రంప్ తాజా నిర్ణయంతో ఆయుధాలు, ఇతర యుద్ధసామగ్రి రూపంలో దాదాపు 100 కోట్ల డాలర్ల విలువైనవి ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి ఉండగా అవన్నీ నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది. రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ కట్టుబడి ఉందని ట్రంప్ సంతృప్తి చెందేవరకు అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు సాయం అందించేది లేదని శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించినట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కథనం తెలిపింది.
జెలెన్‌స్కీ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. కాలమే కొన్నింటిని సరిదిద్దుతుందన్నారు. ‘‘శుక్రవారంనాటి సమావేశం జరగాల్సిన రీతిలో జరగలేదు. అది దురదృష్టకరం. దీనిని సరిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇకపై ఇలాంటి చర్చలు, సహకారం నిర్మాణాత్మకంగా ఉండేలా చూసుకుంటాం. ట్రంప్ ప్రభుత్వం కోరుతున్న రీతిలో అరుదైన ఖనిజాల తవ్వకాల ఒప్పందంపై సంతకాలు చేయడానికి మేం సిద్ధం. దీంతోపాటు మా దేశభద్రతపై ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా సాయం చేయడానికి వారు అంగీకరించాలి. ఈ డీల్ తమ దేశానికి భద్రత కల్పిస్తూ కచ్చితమైన హామీలు ఇవ్వడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుందనే ఆశాభావంతో ఉన్నాను. అంతూపొంతూ లేని యుద్ధాన్ని ఎవరూ కోరుకోవట్లేదు’’ అని జెలెన్‌స్కీ చెప్పారు. ఖైదీల విడుదలకు సిద్ధమేనని, సముద్రమార్గంలో, వాయుమార్గంలో యుద్ధ విరమణకు సుముఖమేనని ప్రకటించారు. ఇంతకాలం తమకు మద్దతుగా నిలుస్తున్నందుకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: ట్రంప్ కాదన్నా మేమున్నాం.. ఉక్రెయిన్ కోసం ముందుకొచ్చిన యూరోప్ దేశాలు..
ఉక్రెయిన్ తన స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని.. కాపాడుకోవడంలో అమెరికా అందించిన సాయాన్ని ఎంతగానో గౌరవిస్తామని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు ట్రంప్ జావెలిన్ ఆయుధాలను అందించిన తర్వాత మారిన పరిస్థితులు తమకు గుర్తున్నాయన్నారు. వైట్ హౌస్‌లో ట్రంప్‌తో శుక్రవారం జరిగిన సంభాషణ ఆశించిన మేర జరగలేదన్నారు. ఆ పరిణామం చాలా విచారకరమన్న ఆయన.. తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమన్నారు. భవిష్యత్తు సహకారం, సంప్రదింపులు నిర్మాణాత్మకంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.
అంతకుముందు లండన్‌లో యురోప్ దేశాధినేతల సమావేశం అనంతరం మాట్లాడిన జెలెన్‌స్కీ.. అగ్రరాజ్యంతో ఖనిజాల ఒప్పందానికి తాము సిద్ధమేనని అన్నారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని, ట్రంప్‌తోమరోసారి భేటీకి వెళ్తానన్నారు. రష్యాతో యుద్ధం ముగింపు ఇంకా సుదూరతీరంలోనే ఉందని, అప్పటివరకు అగ్రరాజ్యం సహకారం అందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్ మిలిటరీ సాయం నిలిపివేయం గమనార్హం. అయితే.. ఇది తాత్కాలికమేనని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా సాయం ఎంత?
ఉక్రెయిన్‌కు 2022 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు 300 బిలియన్ డాలర్లకుపైగా యుద్ధసాయం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. యూరప్ దేశాలు మాత్రం 100 బిలియన్ డాలర్లే ఇచ్చాయని అన్నారు. కానీ, ఆమెరికా ఇచ్చింది 182.8 బిలియన్ డాలర్లేనని సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. ఈ గణాంకాలు తప్పు అని, అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందిన సాయం కేవలం 119.7 బిలియన్ డాలర్లు మాత్రమేనని జర్మనీకి చెందిన కీల్ ఇన్స్టిట్యూట్ స్పష్టం చేసింది.
ఖనిజాల ఒప్పందం ద్వారానే పుతిన్‌ను నిలువరించగలం: జెడి వాన్స్
రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణ ప్రయత్నాలను నిలువరించగలిగేది యూఎస్– ఉక్రెయిన్ మధ్య కీలక ఖనిజాల ఒప్పందం మాత్రమేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇది మాత్రమే ఆచరణ సాధ్యమైన పరిష్కారమన్నారు. యుద్ధం ముగిశాక బ్రిటన్, ఫ్రాన్స్.. సారథ్యంలో ఏర్పాటయ్యే అంతర్జాతీయ బలగాలతో ఉక్రెయిన్‌కు ఎటువంటి భద్రతా ఉండదని వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్.. గత 30, 40 ఏళ్లుగా ఎలాంటి యుద్ధాలు చేయని ఏవో కొన్ని దేశాలకు చెందిన 20 వేల బలగాల కంటే అమెరికాతో కీలక ఖనిజాల ఒప్పందం కుదుర్చుకుంటే ఉక్రెయిన్‌కు మెరుగైన భద్రత లభిస్తుందని చెప్పారు. భద్రతకు గ్యారెంటీ కావాలన్నా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఉక్రెయిన్ భూభాగం ఆక్రమించకుండా ఉండాలన్నా ఉక్రెయిన్‌కు అమెరికా మాత్రమే ఆ గ్యారంటీ ఇస్తుందని తెలిపారు.