Delhi Elections Kejriwal ACB Probe| ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు రాజధానిలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యముంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బిజేపీ ‘ఆపరేషన్ లోటస్’పేరుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు పన్నుతోందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ చేసిన తీవ్ర ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ (LT Governor) వీకే సక్సేనా విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేశారు.
బిజేపీ తమ పార్టీ అభ్యర్థులను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని.. అభ్యర్థులకు ఫోన్ కాల్స్ చేసి రూ. 15 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టినట్లు కేజ్రీవాల్, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. అదే సమయంలో, బిజేపీ తప్పుడు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి, పార్టీ నేతలను భయపెట్టి తమ వైపునకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బిజేపీ ఎన్ని కుట్రలు చేసినా తమ నేతలు మోసపోరని కేజ్రీవాల్ పేర్కొన్నారు. బిజేపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమ పార్టీ నేతలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, బిజేపీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ బిజేపీ అధ్యక్షుడు విరేంద్ర సచ్దేవా మాట్లాడుతూ.. బిజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి భయపడి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ బిజేపీ కార్యదర్శి విష్ణు మిట్టల్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసి ఈ ఆరోపణలపై ఆంటీ కరప్షన్ బ్యూరో (ACB) ద్వారా విచారణ చేయాలని మరియు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో, లెఫ్టినెంట్ గవర్నర్ విచారణ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆ తర్వాత ఏసిబీ అధికారులు కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసాలకు చేరుకున్నారు.
Also Read: రతన్ టాటా వీలునామాలో రహస్య వ్యక్తి – ఏకంగా రూ.500 కోట్ల ఆస్తులు
లెఫ్టినెంట్ గవర్నర్ విచారణ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారుల బృందం కేజ్రీవాల్‌కు లీగల్ నోటీసు పంపించింది. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు అందించాలని నోటీసులో కోరారు. ఎన్నికల ఫలితాలకు ముందు ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. కేజ్రీవాల్, ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, 16 మంది ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు బిజేపీ లంచాలు ఇచ్చిందని ఆరోపించారు. ఈ ట్వీట్‌ను కేజ్రీవాల్ చేసారా లేదా? అని నిర్ధారించాలని ఏసీబీ బృందం కోరింది. అదే సమయంలో, ఫోన్ కాల్స్ అందుకున్న 16 మంది అభ్యర్థుల పేర్లు, వారికి వచ్చిన ఫోన్ నంబర్లు, సంబంధిత సమాచారం అందించాలని అధికారులు కోరారు. ఢిల్లీ ప్రజల్లో ఆందోళన రేకెత్తించేలా ఆరోపణలు చేసినందుకు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని హెచ్చరించారు.
అంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 70 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్యమంత్రి ఆతిషీ, సీనియర్ నేతలు మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్, ఇమ్రాన్ హుస్సేన్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని సమావేశమయ్యారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ACB అధికారులను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
ACB అధికారులు ఎటువంటి లీగల్ నోటీసులు లేకుండా వచ్చారని, గంటన్నర తర్వాత నోటీసులు అందించారని ఆమ్ ఆద్మీ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు సంజీవ్ నాసియార్ పేర్కొన్నారు. బిజేపీతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ ఈ డ్రామా నడిపిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, కేజ్రీవాల్ ఆరోపణలు సరైనవేనని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. 16 మంది కంటే ఎక్కువ మందినే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో, సాయంత్రం 5 గంటల వరకు 57.70 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (ECI) వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బిజేపీ మధ్య తీవ్ర పోటీ జరిగిన ఈ ఎన్నికల్లో, బిజేపీ వైపు ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటించబడతాయి.