Ratan tata last will : రతన్ టాటా మరణించిన తర్వాత ఆయన ఆస్తిలోని వాటాలకు సంబంధించిన వీలునామాలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతున్నాయి. తన తోబుట్టువులతో పాటు తనతో కలిసి పని చేసిన వారికి, ఇంట్లోని పెంపుడు శునకాలకు కూడా కొంత మేర ఆస్తిలో వాటా కల్పించి ఆశ్చర్యపరిచారు. అదే తీరుగా ఇప్పుడు మరో వ్యక్తి పేరు సైతం తన వీలునామాలో బయటకు వచ్చింది. ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన అందులోని ఓ వ్యక్తిపై ఏకంగా రూ.500 కోట్ల మేర ఆస్తిని ఉంచారు రతన్ టాటా. దాంతో.. ఆ వ్యక్తి ఎవరు, అతనితో రతన్ టాటా కు సంబంధం ఏంటి, వీలునామాలోని వ్యక్తి ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అనే ఆసక్తి నెలకొంది.
ఆ రహస్య వ్యక్తి ఎవరు?
రతన్ టాటా వీలునామాల్లో మోహినీ మోహన్ దత్తా అనే ఓ వ్యక్తికి తన ఆస్తిలో రూ. 500 కోట్ల విలువైన ఆస్తులు దక్కేలా రతన్ టాటా వీలునామా రాశారు. ఆయన జంషెడ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపార వేత్తగా మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇతని వయసు ప్రస్తుతం 80 ఏళ్లు కాగా.. 1960ల ప్రారంభంలో మొదటి సారి మోహన్ దత్తా, రతన్ టాటాను కలిశారు. అప్పుడు టాటాకు 24 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచి.. రతన్ టాటాకు వెన్నంటే ఉన్నారని చెబుతుంటారు. వారిరువు తొలిసారి జంషెడ్‌పూర్‌లోని డీలర్స్ హాస్టల్‌లో కలుసుకున్నారని.. తనకు కుటుంబ వ్యాపారంలో రాణించేందుకు తోడ్పడ్డారని రతన్ గుర్తు చేసుకునే వారని చెబుతుంటారు.
రతన్ టాటాను కలవడం తన జీవితాన్నే మార్చేసిందని దత్తా ఎప్పుడూ సంతోషంగా చెబుతుంటారు. ఆ తర్వాత కాలంలో.. టాటా గ్రూప్ కి మరింత దగ్గరైన దత్తా.. హోటల్ తాజ్ గ్రూప్‌తో కలిసి పని చేశారు. తర్వాత కాలంలో స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని స్థాపించి, వ్యాపారాన్ని నడిపించారు. చివరికి.. తాజ్ సర్వీసెస్‌తో విలీనం చేశారు. ఇప్పుడు సైతం అదే సర్వీసెస్ కోసం దత్తా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. మోహినీ మోహన్ దత్తా, రతన్ టాటాకు వ్యాపార సన్నిహితుడు మాత్రమే కాదని, అతడితో వ్యక్తిగత స్నేహమున్న వ్యక్తి అని బాగా తెలిసిన వాళ్లు చెబుతుంటారు. దత్తాను రతన్ టాటా.. దత్త పుత్రుడు కంటే ఎక్కువగా అభిమానిస్తారని చెబుతుంటారు.
Also Read : 700 మంది ఉద్యోగుల తొలగింపు – బౌన్సర్లతో బయటకు నెట్టించిన ఇన్ఫోసిస్
రతన్ టాటా వీలునామా ప్రకారం.. టాటాకు చెందిన ఎస్టేట్‌లో దత్తాకు మూడింట ఒక వంతు లభిస్తోందని టాటా అధికారులు తెలుపుతున్నారు. వీటితో పాటే సంస్థలోని కొన్ని వాటాలు లభిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం.. వీటి విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. కాగా.. రతన్ టాటా ఆస్తిలో ఓ రహస్య వ్యక్తి పేరిట ఏకంగా రూ.500 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉండడంతో అంతా అవాక్కవుతున్నారు. రతన్ టాటా.. తన చివరి రోజుల్లో తాను ఏదిగేందుకు, సంస్థల్లో రాణించేందుకు సాయం చేసిన ఎవరినీ మర్చిపోకుండా సాయంగా నిలిచారని కొనియాడుతున్నారు. ఆయన మంచి మనస్సుకు ఇదో ఉదాహరణ అని ప్రశంసిస్తున్నారు.