Artificial Intelligence : కృత్రిమ మేధస్సు అనేది ఏదో ఒకరోజు మానవ మేధస్సును దాటేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో తయారైన చాట్‌బోట్ చాట్‌జీపీటీపైనే టెక్ సంస్థల దృష్టి మొత్తం ఉంది. దీనిని మించే టెక్నాలజీని తయారు చేయాలని కొందరు అనుకుంటుంటే.. దీని ఎదుగుదలకు ఎలాగైనా చెక్ పెట్టాలని మరికొందరు అనుకుంటున్నారు. అందులో ఎలన్ మస్క్ కూడా ఒకరు.
చాలా టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌పై పగపెట్టుకున్నట్టు అనిపిస్తోంది. అందుకే ప్రముఖ కంప్యూటర్ సైంటిస్టులు, టెక్ నిపుణులతో పాటు ఎలన్ మస్క్, యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ వోజ్‌నియక్.. ఆరు నెలల ఏఐ విరామానికి పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సంస్థ.. జీపీటీ 4ను లాంచ్ చేసిన తర్వాత.. వారు ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీకి అప్డేటెడ్ వర్షన్‌గా జీపీటీ 4 అందుబాటులోకి వచ్చింది.
ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి పెద్ద సంస్థలు కూడా చాట్‌జీపీటీ లాంటి అప్లికేషన్స్‌ను తయారు చేసి యూజర్లకు అందించాయి. కానీ ఎలన్ మస్క్‌లాంటి కొందరు టెక్ దిగ్గజాలు మాత్రం ఏఐలోని లోపాలను చూపించి దానిని ఆరు నెలలు యూజర్లకు దూరం చేయాలనుకుంటున్నారు. మనుషులను ఎదిరించే స్థాయిలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది సమాజానికి, హ్యూమానిటీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుందని వారు అంటున్నారు.
ఇప్పటికే సైన్స్ ఫిక్షన్ లాంటి ఏఐ వల్ల ఎన్నో రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. అంతే కాకుండా ఏఐను డెవలప్ చేయడం వల్ల భవిష్యత్తులో అది క్రియేటర్స్ మాట కూడా వినని స్థాయికి ఎదుగుతుందని టెక్ నిపుణులు అనుమానిస్తున్నారు. ఏఐ అప్డేట్ అవుతున్నకొద్దీ దాని యాక్షన్స్‌ను ఎవరూ కంట్రోల్ చేయలేకపోవచ్చన్నారు. అందుకే ఏఐ ల్యాబ్స్ అన్నింటికి ఆరు నెలలు విరామం ప్రకటించాలని ఎలన్ మస్క్‌తో పాటు ఇతరులు పిలుపునిచ్చారు. జీపీటీ 4కంటే అడ్వాన్స్ ఏఐ తయారీని వెంటనే నిలిపివేయాలన్నారు.
ఒకవేళ వారు చెప్పినట్టు ఏఐ ల్యాబ్స్ మూతపడకపోతే.. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు ఏఐ వల్ల జరిగే ఇబ్బందులను ముందే గ్రహించి, దానికి తగిన చర్యలను ప్రారంభించాయి. అందుకే అమెరికాలో కూడా అలా జరగాలని ఎలన్ మస్క్‌తో పాటు మరెందరో టెక్ నిపుణులు ఈ విన్నపంపై సంతకం పెట్టారు. దీనికి ఏఐ ల్యాబ్స్‌తో పాటు దానిని ఉపయోగిస్తున్న సంస్థలు ఇంకా స్పందించాల్సి ఉంది.