Lemon Business Success Story| చిన్న పెట్టుబడితో కూడా పెద్ద విజయాన్ని సాధించవచ్చని ఓ రైతు నిరూపించారు. కేవలం రూ.100తో ప్రారంభమైన నిమ్మ సాగు ప్రయోగం ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపారంగా మారింది. ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని ఓగి గ్రామానికి చెందిన సంతోష్ సాహు ప్రస్తుతం ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవర్ సాధిస్తున్నారు. అంతేకాదు, తన వ్యాపారం ద్వారా 200 మందికి పైగా రైతులకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నారు. ఆయన విజయం వెనుక తండ్రి ప్రారంభించిన చిన్న ప్రయోగం ఉంది.
సుమారు 15 ఏళ్ల క్రితం సంతోష్ తండ్రి కార్తీక్ సాహు ఈ ప్రయోగం ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఏనుగులు, కోతులు పంటలను తరచూ నాశనం చేసేవి. ముఖ్యంగా వరి, వేరుశనగ పంటలకు రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొనేవారు.
దీనికి పరిష్కారం కోసం కార్తీక్ నిమ్మ సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. ఉద్యానవన శాఖ నుంచి 50 కాగ్జీ నిమ్మ మొక్కలు కొనుగోలు చేశారు. ఒక్కో మొక్క ధర రూ.2 మాత్రమే. దీంతో మొత్తం పెట్టుబడి రూ.100 అయింది. ఆ మొక్కలు బాగా పెరిగి కాయలు కాయడం ప్రారంభించాయి. దీంతో గ్రామంలోని ఇతర రైతులు కూడా నిమ్మ సాగుపై ఆసక్తి చూపించారు.
సుమారు 7 ఏళ్ల క్రితం తండ్రి మరణించిన తర్వాత సంతోష్ వ్యవసాయ బాధ్యతలు తీసుకున్నారు. క్రమంగా చిన్న తోటను పెద్ద వ్యాపారంగా అభివృద్ధి చేశారు. గ్రామంలో చాలామంది రైతులు నిమ్మకాయలు పండిస్తున్నా, సరైన మార్కెట్ దొరకడం లేదని ఆయన గుర్తించారు. ఎక్కువ మంది స్థానిక మార్కెట్లలోనే తమ ఉత్పత్తులను అమ్మేవారు.
దీంతో సంతోష్ రైతుల నుంచి నిమ్మకాయలు కొనుగోలు చేసి పెద్ద నగరాల్లో విక్రయించడం ప్రారంభించారు. ఈ నిర్ణయం రైతులకు మంచి మార్కెట్ అవకాశాలను కల్పించింది.
సంతోష్ తనకున్న ఒక ఎకరం భూమిలో సుమారు 120 నిమ్మ మొక్కలు పెంచుతున్నారు. మరోవైపు 200 మందికి పైగా రైతుల నుంచి నిమ్మకాయలు కొనుగోలు చేస్తున్నారు. అంగుల్, భువనేశ్వర్, కటక్, ధెంకనాల్ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు కూడా పంపిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు.
100 నిమ్మకాయలను రైతుల నుంచి రూ.220 నుంచి రూ.280కు కొనుగోలు చేస్తారు. వాటిని రూ.300 నుంచి రూ.320కు విక్రయిస్తారు. మొక్కలను కూడా ఒక్కొక్కటి రూ.20కు అమ్ముతున్నారు. రెండు ప్రధాన పంట కోతల సీజన్లలో ఆయనకు ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవర్ వస్తోంది.
ఈ గ్రామంలో కాగ్జీ నిమ్మకాయలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటికి పలుచని తొక్క ఉంటుంది. లోపల రసం కూడా ఎక్కువగా లభిస్తుంది.
నిమ్మ మొక్కలు సాధారణంగా మూడు నుంచి నాలుగేళ్లలో కాయలు కాస్తాయి. ఎనిమిది నుంచి తొమ్మిదేళ్ల వయసున్న చెట్లు పంటకాలంలో వారానికి వెయ్యికి పైగా కాయలు ఇస్తాయని సంతోష్ చెబుతున్నారు.
Also Read: ఇల్లు షిఫ్ట్ చేస్తుండగా వస్తువులు మాయం.. ఏసీ, టీవీ ధ్వంసం.. మూవర్స్, ప్యాకర్స్‌కు భారీ జరిమానా
ఓగి గ్రామంలోని దాదాపు 700 కుటుంబాల్లో 500 కుటుంబాలు నిమ్మ సాగు చేస్తున్నాయి. గ్రామం, పరిసర ప్రాంతాల్లో 150 ఎకరాలకు పైగా ఈ పంట సాగవుతోంది. రైతులు ఏడాదికి సగటున రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నారు. కొందరు రైతులు రెండు పంట కోతలతో రూ.80 వేల వరకు ఆదాయం పొందుతున్నారు.
కేవలం రూ.100తో మొదలైన ప్రయోగం ఇప్పుడు వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. సరైన మార్కెటింగ్ ఉంటే చిన్న రైతులు కూడా పెద్ద విజయాలు సాధించవచ్చని ఈ కథ నిరూపిస్తోంది.
Also Read: కాలేజీ చదువుతో పాటు బిజినెస్.. కేవలం 50 రోజుల్లో రూ.15 లక్షలు సంపాదించిన స్టూడెంట్.. ఎలాగంటే