ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్న ఆహారాలను అధికంగా తినటం ముఖ్యం. ప్రధానంగా అల్పాహారంలో మనం తినే ఆహారమే ఆ రోజంతా మనల్ని నడిపిస్తుంది. వైద్యులు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినమని సిఫార్సు చేస్తారు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు, పనీర్ వంటివి ముందుంటాయి. శాఖాహారులు పనీర్ తినేందుకు ఇష్టపడితే, మాంసాహారులు కోడిగుడ్డు తినేందుకు ఇష్టపడతారు. ఏదైనా కూడా ఆరోగ్యకరమైనదే. అయితే బరువు తగ్గే ప్రయాణంలో అల్పాహారంలో పనీర్ లేదా కోడిగుడ్డు ఏది తింటే ఆరోగ్యకరమో తెలుసుకోండి.
అల్పాహారంలో కోడిగుడ్డు తింటే..
బ్రేక్ ఫాస్ట్ లో కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది అల్పాహారానికి మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు. కోడిగుడ్డును పోషకాహారానికి పవర్ హౌస్ అని అంటారు. ఇందులో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. కండరాలను నిర్మించడానికి మరమ్మతు చేయడానికి సహాయపడుతుంది. ఎక్కువసేపు మిమల్ని ఆకలి వేయకుండా ఆపడంలో కూడా ముందుంటుంది. దీనిలో విటమిన్ బి12, విటమిన్ డి వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. కోడిగుడ్లు తినడం వల్ల మెదడు తీరు మారుతుంది. జీవక్రియను పెంచుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, లుటీన్, జియాక్సింతిన్ వంటివి కోడిగుడ్లలో ఉంటాయి. ఇవన్నీ కూడా కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. కోడిగుడ్లలో కేలరీలు కూడా చాలా తక్కువ. పోషకాలు మాత్రం అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. కేవలం బ్రేక్ ఫాస్ట్ లో రెండు కోడిగుడ్లు తింటే చాలు… ఆ రోజు అంతగా ఆకలి వేయకుండా ఉంటుంది.
బ్రేక్ ఫాస్ట్ లో పనీర్ తింటే
పనీర్ తో చేసిన వంటకాలను కూడా అల్పాహారంలో తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. 40 గ్రాముల పనీర్లో ఏడున్నర గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఐదున్నర గ్రాముల కొవ్వు కూడా ఉంటుంది. పనీర్ కూడా కండరాల పెరుగుదలకు రోజంతా శక్తిని స్థిరంగా అందించేందుకు ఉపయోగపడుతుంది. దీనిలో కూడా అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. పనీరు నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కాబట్టి ఇది ఆహారం తినాలన్న కోరికను తగ్గిస్తుంది. బరువు తగ్గడంతో పాటు క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలను కూడా అందిస్తుంది. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేస్తుంది. అన్ని వయసుల వారికి ఇది మంచి ఎంపిక. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా స్థిరంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు అధికంగా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పనీర్ తో అనేక రకాల వంటలు కూడా వండుకోవచ్చు. పనీర్ బుర్జీ, పనీర్ పరాటా, సలాడ్లు, మసాలా కూరలు వంటివి దీనితో తయారు చేయవచ్చు.
గుడ్డు లేదా పనీర్ ఏది మంచిది?
కోడిగుడ్లు, పనీరు రెండిట్లోనూ పోషకాలు నిండుగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. తొమ్మిది రకాల పోషకాలు వీటిలో లభిస్తాయి. ముఖ్యంగా శరీరానికి అత్యవసరమైన విటమిన్ బి12 వీటిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పనీర్, గుడ్డు… రెండూ ఆరోగ్యానికి మేలే చేస్తాయి. బరువు తగ్గాలని ప్రయత్నించే శాఖాహారులు పనీరు తినడం మంచిది. అదే మాంసాహారులైతే కోడిగుడ్లు తినడం అలవాటు చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏది తిన్నా మీకు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
Also Read: ఇంట్లో రస్కులు మిగిలిపోయాయా? వాటితో ఇలా టేస్టీ పాయసం చేసేయండి