Health Tips: మన ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర ఉంటేనే శరీరం చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ.. ఆధునిక జీవనశైలిలో చాలామందికి సరైన నిద్ర ఉండటం లేదు. మీరు తగినంత నిద్రపోవడం లేదని మీ శరీరం కొన్ని సంకేతాల ద్వారా తెలియజేస్తుంది. ఆ సంకేతాలను గుర్తించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంతే కాకుండా వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు.
1. పగటిపూట నిద్రమత్తుగా ఉండటం:
రాత్రి బాగా నిద్రపోయినప్పటికీ.. పగటిపూట నిద్రమత్తుగా అనిపించడం, చిన్నచిన్న పనులు చేస్తున్నప్పుడు నిద్రలోకి జారుకోవడం నిద్ర లేమికి ప్రధాన సంకేతం. ముఖ్యంగా.. ఆఫీసులో ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు లేదా కారు నడుపుతున్నప్పుడు ఇలా నిద్రమత్తుగా అనిపిస్తే అది ప్రమాదకరం.
2. చిరాకు, మూడ్ మార్పులు:
సరిగా నిద్రపోనప్పుడు మెదడు సరిగ్గా పనిచేయదు. దీనివల్ల తరచుగా చిరాకు, కోపం, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్న విషయాలకే ఎక్కువగా స్పందిస్తుంటే అది నిద్ర లేమి వల్ల కావచ్చు. మీ భావోద్వేగాలను నియంత్రించు కోలేకపోవడం కూడా ఒక సంకేతం.
3. ఏకాగ్రత లోపించడం:
నిద్ర లేమి వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఇది ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. పనులపై దృష్టి పెట్టలేకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యమైన విషయాలు కూడా సులభంగా మర్చిపోతుంటే అది ఒక హెచ్చరిక కావచ్చు.
4. తరచుగా అనారోగ్యానికి గురవడం:
నిద్ర మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే.. శరీరం వ్యాధులను, అంటురోగాలను సమర్థవంతంగా ఎదుర్కోలేదు. తరచుగా జలుబు, ఫ్లూ వంటి వాటి బారిన పడుతుంటే.. అది మీ రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని, నిద్ర అవసరమని అర్థం.
5. నిద్రలేచిన వెంటనే అలసటగా ఉండటం:
రాత్రంతా నిద్రపోయిన తర్వాత కూడా ఉదయం లేవడానికి చాలా కష్టపడటం, అలారం మోగిన తర్వాత కూడా స్నూజ్ బటన్‌ను నొక్కాలని అనిపించడం, లేచిన వెంటనే అలసటగా, శక్తి లేనట్లు అనిపించడం నిద్ర లేమికి మరొక సంకేతం. అందుకే వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.
6. ఆకలి పెరగడం, బరువు పెరగడం:
నిద్ర లేకపోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది ఎక్కువగా తినాలనిపించటానికి.. ముఖ్యంగా చక్కెర, కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాలు తినాలని కోరికను పెంచుతుంది. ఇది క్రమంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ సంకేతాలలో ఏవైనా మీకు కనిపిస్తుంటే.. మీ నిద్ర వేళలను సరి చూసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన నిద్ర కోసం, ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేవడానికి ప్రయత్నించండి. పడుకునే ముందు కెఫిన్ వంటి డ్రింక్స్‌కు దూరంగా ఉండటం, పడుకునే గదిని చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచుకోవడం వంటివి పాటించండి. సరైన నిద్ర పొందడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా.. మీ జీవిత నాణ్యత కూడా పెరుగుతుంది.