Covid-19 New Variant: దేశ వ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. జూన్ 2 నాటికి దేశంలో యాక్టీవ్ కొవిడ్ కేసులు 4వేలకు చేరువలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌లలో అత్యధిక కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఒక్క కేరళలోనే ఇప్పటివరకు 1435యాక్టీవ్ కేసులు ఉన్నాయని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో 30 కేసులు, తెలంగాణలో 3 కేసులు నమోదయ్యాయి. ఇక 2025 జనవరి నుంచి దేశవ్యాప్తంగా 32 కోవిడ్ మరణాలు సంభవించాయని అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముందు జాగ్రత్త చర్యలే మన ఆరోగ్యానికి శ్రీరామరక్షా అని సూచిస్తున్నారు.
కరోనా విజృంభన సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పందిస్తూ.. ఇతర వేరియంట్లతో పోలీస్తే ఇప్పుడున్న వేరియంట్ అంత ప్రమాదకరమైంది కాదని తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ వాక్సిన్‌లు ఈ వేరియంట్‌ను సమర్ధంగా ఎదుర్కుంటాయని స్పష్టం చేసింది.
2020-21-22 తరువాత కరోనా కేసుల్లో.. పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. వైరస్ వేరియంట్లలో వస్తున్న మార్పులు.. ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణంగా గుర్తించారు వైద్య నిపుణులు. COVID 19 వేరియంట్ ఓమిక్రాన్ NB.1.8.1 ఇండియా అంతటా కేసుల పెరుగుదలకు కారణం. ఇది అంటువ్యాధి, పరివర్తన వ్యాప్తి చెందే లక్షణం కలిగింది. అందుకే ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది.
కొత్త వేరియంట్ కోవిడ్ లక్షణాలు జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులు, అలసట ముక్కు కారటం వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు బూస్టర్ డోస్ తీసుకున్న వారికి సైతం మారుతున్న వేరియంట్ల రీత్యా కోవిడ్ సోకే అవకాశం ఉంది. సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, రద్దీ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవడం, పరిశుభ్రత పాటించడం కోవిడ్ వైరస్ దరిచేరకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యలుగా కొనసాగుతున్నాయి.
Also Read: మీకు ఒక కూతురు ఉందా? అయితే మీరు కచ్చితంగా ఆమెకు చెప్పాల్సిన విషయాలు ఇదిగో
దేశంలో కేసుల పెరుగుదల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. ఆసుపత్రులకు, ప్రజలకు పలు సూచనలు జారీ చేశాయి.. పడకల లభ్యత, ఆక్సిజన్ సిలిండర్లు పునరుద్ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలతో.. ఆసుపత్రులు హై అలర్ట్‌లో ఉంచాయి. అనేక ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డులను సైతం ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుత కోవిడ్ కేసుల పెరుగుదలతో భయపడవద్దని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు తెలియజేసింది.