Analogue Paneer vs Real Paneer: మనం రోజూ ఎంతో ఇష్టంగా తినే పనీర్ విషయంలో ఒక కొత్త చర్చ మొదలైంది. మార్కెట్‌లో చూడటానికి అసలు పనీర్‌లాగే ఉండే ‘అనలాగ్ పనీర్’ విరివిగా లభిస్తోంది. ముఖ్యంగా ప్రోటీన్ కోసం పనీర్‌పై ఆధారపడేవారు దీని గురించి తప్పక తెలుసుకోవాలి.
సాధారణ పనీర్‌ను స్వచ్ఛమైన పాలను విరిచి తయారుచేస్తారు. కానీ అనలాగ్ పనీర్‌లో పాల శాతాన్ని తగ్గించి లేదా పూర్తిగా తీసేసి, దానికి బదులుగా వెజిటబుల్ ఫ్యాట్స్, స్టార్చ్, ప్లాంట్ ప్రొటీన్లను ఉపయోగిస్తారు. చూడటానికి, తాకడానికి ఇది సేమ్ టూ సేమ్ అసలు పనీర్‌లాగే ఉంటుంది. అందుకే కేవలం దాని రూపాన్ని బట్టి నిజమైన పనీర్‌ని గుర్తుపట్టడం ఎవరికైనా చాలా కష్టం.
అనలాగ్ పనీర్ ఏదో ఒకసారి తింటే పెద్దగా ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చు. కానీ రోజూ తింటే మాత్రం పోషకాహార లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రోటీన్ కోసం పనీర్‌పై ఆధారపడేవారికి ఇది పెద్ద దెబ్బ. పాల పనీర్ ద్వారా లభించే మంచి ప్రొటీన్ దీని నుంచి అందదు. పైగా ఇందులో వాడే వెజిటబుల్ ఫ్యాట్స్, స్టార్చ్ వల్ల శరీరంలోకి అనవసరమైన కొవ్వులు చేరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
Also Read: బరువు తగ్గాలంటే పస్తులు ఉండాలా? Eating Less వెనుక ఉన్న పెద్ద డేంజర్ ఇదే!
ప్యాకెట్ పనీర్ కొనేటప్పుడు దాని వెనుక ఉండే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ తప్పక చూడాలి. అందులో వెజిటబుల్ ఆయిల్, స్టార్చ్ లేదా పామ్ ఆయిల్ అని ఉంటే అది అనలాగ్ పనీర్ అని అర్థం చేసుకోవాలి. ప్యాకెట్‌పై ‘అనలాగ్’ అని గానీ, ‘నాన్ డెయిరీ’ అని గానీ రాసి ఉందో లేదో గమనించాలి. రంగు, మెత్తదనాన్ని బట్టి అసలు పనీర్‌ను గుర్తించడం సాధ్యం కాదు.
విడిగా లేదా లూజ్‌గా అమ్మే పనీర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. వాటికి ఎలాంటి లేబుల్స్ ఉండవు కాబట్టి అసలు విషయం తెలీదు. అందుకే నమ్మకమైన డెయిరీ షాపుల నుంచే కొనుగోలు చేయడం మంచిది. హోటల్స్ లేదా బయట పదార్థాలు తినేటప్పుడు కూడా ఇది గుర్తుంచుకోవాలి. మనం తినే ఆహారం పట్ల చిన్న జాగ్రత్త వహిస్తే మన ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.
Also Read: క్యాన్సర్ రీలాప్స్ అంటే ఏమిటి? చికిత్స తర్వాత మళ్లీ క్యాన్సర్ రావడానికి అసలు కారణాలివే!