Cancer Recurrence: ఇటీవల ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ క్యాన్సర్ తిరగబెట్టడం వల్లే తుదిశ్వాస విడిచారనే వార్త చాలామందిని తీవ్రంగా కలిచివేసింది. ఒకసారి క్యాన్సర్ బారిన పడి, చికిత్స తీసుకుని, కోలుకున్న తర్వాత కూడా మళ్లీ ఆ వ్యాధి దాడి చేయడమే ‘క్యాన్సర్ రీలాప్స్’ లేదా తిరగబెట్టడం. వ్యాధి నయమైందని అనుకున్న కొద్దికాలానికే ఇలా జరగడం ఎంతో ఆందోళన కలిగిస్తుంది. అసలు చికిత్స పూర్తయ్యాక కూడా క్యాన్సర్ మళ్లీ ఎందుకు వస్తుంది? దీనికి గల ప్రధాన కారణాలు ఏమిటో.. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
డాక్టర్ల పరిశోధనల్లో క్యాన్సర్ కణాలు ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించని స్థితిని ‘రెమిషన్’ అంటారు. అయితే, శరీరంలో చికిత్సకు లొంగకుండా చాలా చిన్న పరిమాణంలో కొన్ని క్యాన్సర్ కణాలు ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఇవి స్కానింగ్ లేదా పరీక్షల్లో కూడా వెంటనే బయటపడవు. ఈ కణాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు ఏమాత్రం చలనం లేకుండా సుప్తచేతనావస్థలో ఉండిపోతాయి. కాలక్రమేణా ఇవి మళ్లీ పెరగడం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ తిరగబెట్టిందని చెప్తారు.
Also Read: పీరియడ్స్ సమయంలో తలనొప్పి, వాంతులు, వెలుతురు పడకపోవడం? కారణం ఇదే..
క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టిందంటే పరిస్థితి తీవ్రమైనదే అని అర్థం చేసుకోవాలి. అయితే, దీనివల్ల అవకాశాలన్నీ మూసుకుపోయాయని అనుకోవాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ ఏ అవయవంలో తిరగబెట్టింది, అది ఒకే చోట ఉందా లేక శరీరమంతటా వ్యాపించిందా అనే దానిపై తదుపరి చికిత్స ఆధారపడి ఉంటుంది. మొదటిసారి చికిత్స తీసుకున్న తర్వాత ఎంతకాలం విరామం వచ్చింది, రోగి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలను పరిశీలించి వైద్యులు కొత్త తరహా వైద్య విధానాలను నిర్ణయిస్తారు.
క్యాన్సర్ చికిత్స పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ శరీరం ఇచ్చే సంకేతాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం లేకుండా వేగంగా బరువు తగ్గిపోవడం, నిరంతరం నీరసంగా ఉండటం, శరీరంలో ఎక్కడైనా కొత్తగా గడ్డలు ఏర్పడటం వంటి మార్పులను గమనించాలి. అలాగే తగ్గని దగ్గు, ఆయాసం, ప్రేగులు లేదా మూత్రాశయ అలవాట్లలో మార్పులు, అసాధారణ రక్తస్రావం వంటివి కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ తిరిగొచ్చిందని భయపడాల్సిన పనిలేదు.. కానీ వైద్యులను సంప్రదించడం మంచిది.
క్యాన్సర్ చికిత్స ముగిసిన తర్వాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్‌లకు వెళ్లడం చాలా అవసరం. వైద్యులు చెప్పిన సమయానికి ఫాలోఅప్ పరీక్షలు చేయించుకోవడం వల్ల ఒకవేళ క్యాన్సర్ మళ్లీ మొదలవుతున్నా.. దానిని ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. శరీరంలో ఏ చిన్న కొత్త మార్పు కనిపించినా సొంత వైద్యం చేసుకోకుండా.. వెంటనే మిమ్మల్ని పర్యవేక్షిస్తున్న క్యాన్సర్ నిపుణుడిని సంప్రదించి సలహా తీసుకోవడమే అత్యంత సురక్షితమైన మార్గం.
Also Read: బరువు తగ్గాలంటే పస్తులు ఉండాలా? Eating Less వెనుక ఉన్న పెద్ద డేంజర్ ఇదే!