Eggs: రోజూ ఒక ఎగ్ తినడం గుండె ఆరోగ్యానికి మంచిదా, కాదా అనే విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. గతంలో గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణమవుతుందని చాలామంది భావించారు. కానీ.. ఇటీవల చేసిన పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని మార్చాయి. ఇంతకీ గుండె ఆరోగ్యానికి గుడ్లు నిజంగా ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్‌లోని పోషకాలు:
ఎగ్ ఒక సంపూర్ణమైన ఆహారం. ఇందులో విటమిన్లు (విటమిన్ B12, విటమిన్ D), మినరల్స్ (ఐరన్, జింక్), ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా.. ఎగ్ లోని పచ్చసొనలో విటమిన్ A, E, K, ఫోలేట్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
ఎగ్, కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యం:
ఎగ్‌లో అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ.. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అంతగా పెంచదని చాలా పరిశోధనలు రుజువు చేశాయి. శరీరంలో చాలావరకు కొలెస్ట్రాల్ కాలేయం ద్వారా ఉత్పత్తి అవుతుంది. బయటి నుంచి తీసుకునే కొలెస్ట్రాల్ దీనిపై తక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా.. గుడ్లలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
రోజూ ఒక ఎగ్ తినడం వల్ల కలిగే లాభాలు:
గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది: రోజు ఒక ఎగ్ తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం పాటించేవారిలో రోజూ ఒక ఎగ్ తినడం వల్ల ఎలాంటి హాని ఉండదు.
మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది: గుడ్లలోని పోషకాలు, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది: ఎగ్స్ లోని ప్రోటీన్ రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.
బరువు నియంత్రణలో ఉంటుంది: ఎగ్స్ తినడం వల్ల త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీనివల్ల ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.బరువు తగ్గాలని అనుకునేే వారు కూడా తరచుగా ఎగ్స్ తినడం చాలా మంచిది.
Also Read: దానిమ్మ తినేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా ?
ఎవరు జాగ్రత్తగా ఉండాలి ?
డయాబెటిస్ ఉన్నవారు: డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు రోజూ గుడ్డు తినే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
వారసత్వంగా వచ్చే కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు: కొందరికి వంశపారంపర్యంగా అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాంటివారు ఎగ్ తీసుకోవడం తగ్గించడం మంచిది.
సాధారణంగా ఆరోగ్యవంతులైన వ్యక్తులు రోజుకు ఒక గుడ్డు తినడం గుండెకు మంచిదే. అయితే.. గుడ్డును ఎలా వండుతున్నారనేది ముఖ్యం. నూనెలో వేయించిన గుడ్లకు బదులుగా.. ఉడికించిన గుడ్లు తినడం ఉత్తమం. మొత్తానికి.. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు.. రోజుకు ఒక గుడ్డు తినడం మంచిదే. కానీ ఏదైనా సందేహం ఉంటే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.