Himalayan Pink Salt: సాధారణ టేబుల్ సాల్ట్ (సాధారణ ఉప్పు)కు ప్రత్యామ్నాయంగా ఇటీవల బాగా ప్రాచుర్యం పొందినది హిమాలయన్ పింక్ సాల్ట్. పాకిస్తాన్‌లోని హిమాలయ పర్వత శ్రేణులలోని ఖేవ్రా సాల్ట్ మైన్ నుంచి తవ్వబడే ఈ ఉప్పుకు దాని ప్రత్యేకమైన గులాబీ రంగు అక్కడి ఖనిజాల ఉనికి వల్ల వస్తుంది. సాధారణ ఉప్పు కంటే ఇది ఆరోగ్యకరమైనదని చాలామంది నమ్ముతారు. అసలు హిమాలయన్ పింక్ సాల్ట్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం.
హిమాలయన్ పింక్ సాల్ట్ అంటే ఏమిటి ?
హిమాలయన్ పింక్ సాల్ట్ అనేది మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన పురాతన సముద్రపు నిక్షేపాల నుండి లభించే రాతి ఉప్పు. ఇది శుద్ధి చేయబడదు కాబట్టి.. ఇందులో సోడియం క్లోరైడ్‌తో పాటు ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి సుమారు 84 రకాల ట్రేస్ మినరల్స్ (సూక్ష్మ ఖనిజాలు) ఉన్నాయని చెబుతారు. ఈ ఖనిజాలే దీనికి ప్రత్యేకమైన గులాబీ రంగును, అంతే కాకుండా ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి.
హిమాలయన్ పింక్ సాల్ట్ ప్రయోజనాలు:
ఖనిజాల సమృద్ధి:
సాధారణ ఉప్పులో కేవలం సోడియం క్లోరైడ్ మాత్రమే ఉంటుంది. కానీ పింక్ సాల్ట్‌లో శరీరానికి అవసరమైన అనేక సూక్ష్మ ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరం యొక్క వివిధ విధులకు తోడ్పడతాయి. అయితే.. ఈ ఖనిజాల సాంద్రత మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి నుంచి గణనీయమైన ప్రయోజనాలు పొందాలంటే పెద్ద మొత్తంలో ఉప్పును తినాల్సి ఉంటుంది. అది ఆరోగ్యకరం కాదు.
శరీరంలో pH స్థాయిల సమతుల్యత:
హిమాలయన్ పింక్ సాల్ట్ శరీరంలోని pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీర ఆమ్లత్వాన్ని తగ్గించి, మరింత ఆల్కలైన్‌గా మార్చడంలో సహాయపడుతుంది. అయితే.. దీనిపై శాస్త్రీయ ఆధారాలు లేవు.
నీటి సమతుల్యత, హైడ్రేషన్:
ఉప్పు ఎలక్ట్రోలైట్ సమతుల్యతకు కీలకం. పింక్ సాల్ట్‌లోని ఖనిజాలు శరీరాన్ని సరైన విధంగా హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా వ్యాయామం తర్వాత కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియకు సహాయం:
కొందరు వ్యక్తులు పింక్ సాల్ట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహాయపడుతుంది.
మెరుగైన నిద్ర:
మెగ్నీషియం వంటి కొన్ని ఖనిజాలు నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఫలితంగా ఇది పింక్ సాల్ట్ నిద్రను నేరుగా ప్రభావితం చేస్తుంది.
శ్వాసకోశ ఆరోగ్యం:
“సాల్ట్ థెరపీ” లేదా “హలోథెరపీ”లో పింక్ సాల్ట్ ఉపయోగిస్తారు. సాల్ట్ లాంప్‌లు లేదా సాల్ట్ గుహలు శ్వాసకోశ సమస్యలున్నవారికి ఉపశమనం కలిగిస్తాయి.
Also Read: ఖాళీ కడుపుతో ఉసిరి తింటే.. ఇన్ని లాభాలా ?
హిమాలయన్ పింక్ సాల్ట్ కొన్ని అదనపు ఖనిజాలను కలిగి ఉన్నప్పటికీ.. దానిలోని ఖనిజాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణ ఉప్పు మాదిరిగానే, పింక్ సాల్ట్‌లో కూడా ప్రధానంగా సోడియం క్లోరైడ్ ఉంటుంది. అందుకే.. ఎక్కువ మొత్తంలో పింక్ సాల్ట్ తీసుకోవడం వల్ల కూడా అధిక సోడియం సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది.