Visakhapatnam Railway Station: విశాఖ నగర ప్రయాణికులకు ఇది గుడ్ న్యూస్.. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఇప్పుడిప్పుడే వేగం చేకూరుతోంది. సౌకర్యాల అభివృద్ధి, ట్రాఫిక్ క్లియర్ చేసే మార్గంలో రైలు ప్రయాణం మరింత స్మార్ట్‌గా మారబోతోంది. ఇటీవలే ప్రారంభమైన అభివృద్ధి పనులు పూర్తయ్యే సరికి, విశాఖ స్టేషన్ దేశంలో మోడరన్ స్టేషన్‌ల జాబితాలో స్థానం సంపాదించనుంది.
ప్రస్తుతం 8 ప్లాట్‌ఫాంలతో ఉన్న విశాఖపట్నం జంక్షన్‌ను మొత్తం 14 ప్లాట్‌ఫాంలుగా విస్తరిస్తున్నారు. అంటే కొత్తగా 6 ప్లాట్‌ఫాంలు నిర్మించనున్నారు. అధిక రైళ్ల రాకపోకలకు అనుగుణంగా యార్డు మోడలింగ్ కూడా చేపడుతున్నారు. అంటే రైళ్లు ఎదురెదురు రావడం, నిలిపే సమయాలు తగ్గించేందుకు ట్రాక్స్‌ను శాస్త్రీయంగా మలుస్తారు. ఇది పెద్ద ప్రయాణికుల ఊరటే.
ఈ పనులలో భాగంగా స్టేషన్‌లో 12 మీటర్ల వెడల్పుతో నూతన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB) నిర్మించనున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు సులభంగా ప్లాట్‌ఫాంల మధ్య కదలిక చేసుకునేలా కొత్త ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీ సదుపాయాన్ని మరింత ఆధునికంగా రూపొందించనున్నారు.
అంతే కాదు, విశాఖ స్టేషన్‌ను పూర్తిగా టర్మినల్ స్టేషన్‌గా మార్చే ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతోంది. ఇందుకోసం సవరణ చేసిన డీపీఆర్ (Revised Detailed Project Report) ప్రస్తుతానికి సమీక్ష దశలో ఉంది. ఇది ఆమోదం పొందితే, ఇకపై విశాఖ స్టేషన్ నుంచే ప్రారంభమయ్యే రైళ్ల సంఖ్య పెరగనుంది. మిగతా స్టేషన్‌లపై భారం తగ్గించడంతో పాటు, నగర రవాణాకు కూడా ఇది ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.
Also Read: Driver less metro trains: డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్స్.. తయారీ ఏపీలో.. ప్రయాణం ఎక్కడంటే?
ఈ పునఃనిర్మాణంతో నగర ప్రజలకు ప్రయాణ అనుభవం పూర్తిగా మారనుంది. స్టేషన్‌లో తలదించుకుని దిగుతున్న సందర్శకులు ఇక ఫోన్ తీయకుండా ఉండలేరు.. విశాఖ నగరాన్ని ప్రతిబింబించే విధంగా స్టేషన్‌ను తీర్చిదిద్దే కార్యక్రమానికి భారీ బడ్జెట్ కేటాయించనున్నారు. ఇప్పటికే టెండర్లు పిలిచిన పనుల్లో కొన్నింటికి పనులు ప్రారంభమవుతుండగా, కొన్ని త్వరలో మొదలుకానున్నాయి.
రైల్వే శాఖ చేస్తున్న ఈ అడుగు విశాఖ నగరాభివృద్ధిలో ఒక కీలక మైలు రాయిగా నిలుస్తుంది. ప్రయాణికుల భద్రత, వేగవంతమైన కదలిక, ఆధునికత ఇవన్నింటి కలయికతో విశాఖ రైల్వే స్టేషన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. ఈ రివ్యాంప్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, విశాఖ స్టేషన్‌ను చూసేందుకు దేశంలోని ఇతర నగరాల నుంచి కూడా అధికారుల బృందాలు వస్తాయని అంచనా!
ఇలా చూస్తే, నగర ప్రజలే కాదు.. రైలు ప్రయాణికులందరికీ ఇది శుభవార్తే. రాబోయే రోజుల్లో విశాఖ స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాల రేంజ్‌కు చేరుకుంటుందని చెప్పడంలో సందేహమే లేదు. ఈ స్టేషన్ ఇప్పుడు కొత్తగా ఆవిర్భవిస్తున్న విశాఖ అభివృద్ధి వైపు ప్రయాణించే మరో ట్రాక్‌గా మారింది!