Amla Benefits: ఉసిరి (ఆమ్ల)ని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో పాటు అనేక ఇతర పోషకాలను ఉంటాయి. అందుకే ఉసిరి తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఉసిరిని పరగడుపున తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఇది మీ రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించడానికి ఒక సులభమైన, శక్తివంతమైన మార్గం. ఉసిరి పరగడుపున తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఉసిరిలో నారింజ పండ్ల కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. పరగడుపున ఉసిరిని తీసుకోవడం వల్ల శరీరం విటమిన్ సిని సమర్థవంతంగా శోషించుకుంటుంది. తద్వారా జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఉసిరి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
ఉసిరిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అంతే కాకుండా మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఉదయం పూట పరగడుపున ఉసిరిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అంతే కాకుండా పేగు కదలికలు కూడా సజావుగా జరుగుతాయి. ఇది గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
డిటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది:
ఉసిరి ఒక సహజమైన డిటాక్సిఫైయర్. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పరగడుపున ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. అంతే కాకుండా రక్తం శుద్ధి అవుతుంది. తద్వారా మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి:
విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఉసిరి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి, చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి, జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. జుట్టును బలంగా మార్చి మెరిసేలా చేస్తుంది.
బరువు తగ్గడానికి దోహదపడుతుంది:
ఉసిరి మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా ఇది కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతుంది. దీనిలోని ఫైబర్ పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి.. అతిగా తినడాన్ని కూడా నివారిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది:
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉసిరి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది కార్బోహైడ్రేట్ల శోషణను కూడా నెమ్మదిస్తుంది.
Also Read: షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ?
ఎలా తినాలి ?
పరగడుపున ఉసిరిని తీసుకోవడానికి అనేక మార్గాలున్నాయి:
పచ్చి ఉసిరి: ఒక చిన్న ఉసిరి కాయను నేరుగా తినవచ్చు.
ఉసిరి రసం: ఒక ఉసిరిని మిక్సీలో వేసి రసం తీసి, దానికి కొద్దిగా నీరు కలిపి తాగవచ్చు. రుచి కోసం తేనె లేదా చిటికెడు ఉప్పు కూడా కలుపుకోవచ్చు.
ఉసిరి పొడి: ఒక టీస్పూన్ ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోండి.