Weight loss: చాలా మంది ప్రస్తుతం అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది జిమ్‌లకు వెళ్తుంటే ఇంకొందరు తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.
బరువు తగ్గడం అనేది మంచి ఆరోగ్యం కోసం కూడా చాలా అవసరం. స్థూలకాయం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే.. బరువు తగ్గడం అనేది రాత్రికి రాత్రే జరిగే ప్రక్రియ కాదు. దానికి నిబద్ధత, సరైన ప్రణాళిక, క్రమశిక్షణ అవసరం. మీరు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. సమతుల్య ఆహారం తీసుకోండి:
ఆహారం విషయంలో మార్పులు చేసుకోవడం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇందుకోసం పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి. వీటిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి, తక్కువ ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా గుడ్లు, చికెన్, చేపలు, పప్పులు, పన్నీర్ వంటివి మీ ఆహారంలో భాగం చేసుకోండి. ప్రొటీన్లు జీవక్రియను పెంచి, కండరాలను బలోపేతం చేస్తాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. బిస్కెట్లు, చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, చక్కెర కలిపిన డ్రింక్స్ వంటివి అధిక కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటాయి. వీటికి బదులు సహజమైన ఆహారాలను తీసుకోండి. అంతే కాకుండా అవకాడో, నట్స్, గింజలు, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను మితంగా తీసుకోండి. ఇవి సంతృప్తిని ఇస్తాయి. చిన్న చిన్న మొత్తాల్లో తినండి. రోజుకు 5-6 చిన్న భోజనాలు తీసుకోవడం వల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది.
2. క్రమం తప్పకుండా వ్యాయామం :
కేవలం ఆహారం మాత్రమే కాదు. వ్యాయామం కూడా బరువు తగ్గడంలో చాలా ముఖ్యం. నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి గుండె ఆరోగ్యానికి మంచివి. ఇవి ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తాయి. బరువులు ఎత్తడం లేదా బాడీ వెయిట్ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల కండరాలు పెరుగుతాయి. కండరాలు ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తాయి. తద్వారా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ కొవ్వును కరిగిస్తాయి. ప్రతిరోజూ కనీసం 30-60 నిమిషాల పాటు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి.
3. తగినంత నిద్ర పొందండి:
నిద్ర లేకపోవడం బరువు పెరగడానికి కారణమవుతుంది. నిద్ర సరిపోనప్పుడు, శరీరం హార్మోన్ల సమతుల్యతను కోల్పోతుంది. ఆకలిని పెంచే గ్రెలిన్హార్మోన్ స్థాయిలు పెరిగి, ఆకలిని అణిచివేసే లెప్టిన్ స్థాయిలు తగ్గుతాయి. కనీసం 7-8 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోండి.
4. నీరు ఎక్కువగా త్రాగండి:
నీరు కేలరీలు లేని డ్రింక్. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల తక్కువ ఆహారం తీసుకోవచ్చు. జీవక్రియను పెంచడానికి కూడా నీరు సహాయపడుతుంది. అందుకే రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడానికి ప్రయత్నించండి.
5. ఒత్తిడిని తగ్గించుకోండి:
అధిక ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్‌ను పెంచుతుంది. ఇది బరువు పెరగడానికి, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు లేదా మీకు నచ్చిన హాబీలు అనుసరించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
6. మీ పురోగతిని ట్రాక్ చేసుకోండి:
మీ బరువును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం, మీరు తినే ఆహారం, చేసే వ్యాయామాలను రికార్డు చేసుకోవడం వల్ల మీ పురోగతిని తెలుసుకోవచ్చు. ఇది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అవసరమైన మార్పులు చేసుకోవడానికి సహాయపడుతుంది.