Black Sesame Seeds:నల్ల నువ్వులను చాలా మంది ఆహార పదార్థాల తయారీలో వాడుతుంటారు. ఆయుర్వేద వైద్యంలో ఒక ముఖ్యమైన పదార్థంగా కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. ఇవి కేవలం వంటకాలకు రుచిని చేర్చడమే కాకుండా.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నివారించడంలో నల్ల నువ్వులు ఉపయోగపడతాయి. కానీ ఏ ఆహార పదార్థాన్నైనా మితంగా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
నల్ల నువ్వుల ప్రయోజనాలు:
1. పోషకాల గని:
నల్ల నువ్వులలో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఐరన్, జింక్ విటమిన్ బి1 (థయామిన్) వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
2. ఎముకల ఆరోగ్యం:
కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల నల్ల నువ్వులు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, బోలు ఎముకల వ్యాధి (osteoporosis) వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
3. గుండెకు మేలు:
నల్ల నువ్వులలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా మోనో అన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా వీటిలోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
4. జీర్ణక్రియకు సహాయం:
ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.ఇది మలబద్ధకాన్ని నివారించి.. పేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా చేయడంలో నల్ల నువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి.
5. యాంటీఆక్సిడెంట్ గుణాలు:
నల్ల నువ్వులలో సెసమిన్ (sesamin) సెసమోలిన్ (sesamolin) వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి, కణాలను రక్షించడంలో సహాయపడతాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
6. చర్మం, వెంట్రుకల ఆరోగ్యం:
యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. నువ్వుల నూనెను జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా జట్టు బలంగా తయారవడానికి కూడా తోడ్పడుతుంది.
Also Read: పసన పండు తింటే.. బోలెడు ప్రయోజనాలు
నల్ల నువ్వుల దుష్ప్రభావాలు:
1. అలర్జీలు:
కొంతమందికి నువ్వుల తింటే అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా దీనివల్ల దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
2. జీర్ణ సమస్యలు:
అధిక మొత్తంలో నువ్వులను తీసుకోవడం వల్ల కొందరిలో జీర్ణ సమస్యలు, ముఖ్యంగా అతిసారం లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది జరగవచ్చు.
3. రక్తపోటును తగ్గించడం:
నువ్వులు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి కాబట్టి.. ఇప్పటికే లోబీపీ (Hypotension) ఉన్నవారు లేదా మందులు వాడుతున్నవారు వీటిని ఎక్కువగా తీసుకోకుండా ఉండటం మంచిది.
4. బరువు పెరగడం:
నువ్వులలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నప్పటికీ, వాటిలో కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అధిక మొత్తంలో నువ్వులను తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.