Blueberry Benefits: బ్లూబెర్రీస్‌ను “సూపర్‌ఫుడ్” అని పిలవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ చిన్న, నీలి రంగు పండ్లు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా.. మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలను, ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా అందిస్తాయి. బ్లూబెర్రీస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు:
బ్లూబెర్రీస్‌లో యాంతోసైనిన్స్ అనే ఫ్లవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి పండ్లకు ఆ ప్రత్యేకమైన నీలి రంగును ఇస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా కణాలు దెబ్బతినకుండా కాపాడి, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
2. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది:
బ్లూబెర్రీస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి మెదడులోని నరాల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి క్షీణతను తగ్గించడంలో బ్లూబెర్రీస్ ఎంతగానో ఉపయోగపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
3. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
ఈ పండ్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. బ్లూబెర్రీస్‌లో ఉండే ఫైబర్, పొటాషియం, ఫోలేట్ , యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
4. మధుమేహం నియంత్రణలో సహాయం చేస్తుంది:
బ్లూబెర్రీస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచవు. వీటిలో ఉండే యాంతోసైనిన్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. తద్వారా టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు లేదా వచ్చే ప్రమాదం ఉన్నవారు బ్లూబెర్రీస్‌ను వారి ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
5. జీర్ణక్రియకు మంచిది:
బ్లూబెర్రీస్‌లో పీచుపదార్థం (ఫైబర్) అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. క్రమమైన పేగు కదలికలకు సహాయపడటం ద్వారా ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గాలనుకునే వారిని బ్లూబెర్రీస్ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Also Read: వర్షాకాలంలో తేనె తింటే.. ఇన్ని ప్రయోజనాలా ?
6. కంటి చూపును మెరుగుపరుస్తుంది:
బ్లూబెర్రీస్‌లో ఉండే యాంతోసైనిన్స్ కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. ఇవి రెటీనాను కాపాడి, రాత్రిపూట కంటి చూపును మెరుగుపరుస్తాయి. అలాగే.. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇవి తోడ్పడతాయి. కంటి సంబంధిత సమస్యలు ఉన్న వారు తరచుగా బ్లూ బెర్రీస్ తినడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి.
మీరు వీటిని నేరుగా కూడా తినొచ్చు. లేదా స్మూతీస్, సలాడ్స్, యోగర్ట్ లేదా ఓట్‌మీల్‌లో చేర్చుకుని కూడా తినవచ్చు. ప్రతి రోజు మీరు తినే ఆహారంలో బ్లూబెర్రీస్‌ను చేర్చుకోవడం వల్ల మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు.