Calcium Deficiency: కాల్షియం మన శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటి. ఇది ఎముకలు, దంతాల నిర్మాణానికి, కండరాల పనితీరుకు, నరాల వ్యవస్థకు, రక్తం గడ్డకట్టడానికి చాలా అవసరం. శరీరంలో కాల్షియం లోపించినప్పుడు దాని ప్రభావాలు వివిధ రూపాల్లో కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ లక్షణాలు వెంటనే కనిపించవు. కానీ దీర్ఘకాలికంగా కొనసాగితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
సాధారణ లక్షణాలు:
ఎముకల బలహీనత:
కాల్షియం లోపానికి ఇది ప్రధాన సంకేతం. ఎందుకంటే శరీరం తన అవసరాల కోసం ఎముకల నుంచి కాల్షియం తీసుకోవడం మొదలుపెడుతుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడి, పెళుసుగా మారతాయి. ఇది ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. దీనివల్ల చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగే అవకాశం పెరుగుతుంది.
కండరాల తిమ్మిరి, నొప్పులు:
కాల్షియం కండరాల సంకోచానికి సహాయపడుతుంది. కాల్షియం లోపం ఏర్పడినప్పుడు, చేతులు, కాళ్లు, పాదాలు, లేదా ముఖంలో తరచుగా తిమ్మిర్లు, కండరాలు పట్టేయడం లేదా జలదరింపు లాంటి అనుభూతి కలుగుతుంది.
దంత సమస్యలు:
కాల్షియం దంతాల ఆరోగ్యానికి కూడా చాలా కీలకం. కాల్షియం లోపించడం వల్ల దంతాలు బలహీనపడటం, దంతక్షయం, చిగుళ్ల సమస్యలు తలెత్తుతాయి.
అలసట, నిస్సత్తువ:
శరీరంలో కాల్షియం తక్కువగా ఉంటే, నిరంతరం అలసిపోయినట్లు, బలహీనంగా అనిపిస్తుంది. సరైన నిద్ర ఉన్నప్పటికీ తరచుగా బద్ధకం , నిస్సత్తువగా ఉండటం కాల్షియం లోపానికి ఒక ముఖ్యమైన లక్షణం.
గోళ్ల పెళుసుదనం:
బలహీనమైన, సులభంగా విరిగిపోయే గోళ్లు కూడా కాల్షియం లోపానికి సంకేతం కావచ్చు.
మానసిక సమస్యలు:
తీవ్రమైన కాల్షియం లోపం జ్ఞాపకశక్తి మందగించడం, గందరగోళం, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక లక్షణాలను కూడా కలిగిస్తుంది.
Also Read: ఒత్తిడి గుండెపోటు, స్ట్రోక్‌కు కారణమవుతుందా ?
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి ?
పైన పేర్కొన్న లక్షణాలు మీలో కనిపిస్తున్నట్లయితే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ముఖ్యంగా గర్భవతులు, పాలిచ్చే తల్లులు, వృద్ధులు, పీరియడ్స్ ఆగిపోయిన మహిళల్లో కాల్షియం లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఆహారంలో కాల్షియం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, చేపలు, బాదం, నువ్వులు వంటి వాటిని తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు. అవసరమైతే.. డాక్టర్ సలహా మేరకు కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. అయితే, వైద్యుల పర్యవేక్షణ లేకుండా సొంతగా సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది కాదు. సరైన చికిత్స, పోషకాహారం ద్వారా కాల్షియం లోపాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.