Food Safety Tips: ఇంట్లో మిగిలిపోయిన వేడి వేడి ఆహారాన్ని ..లేదా వంటకాన్ని చెడి పోకుండా ఉండటానికి వెంటనే ఫ్రిజ్‌లో పెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది.చూడటానికి ఇది చాలా సాధారణమైన పనే అనిపించినా.. దీని వల్ల మీ ఆరోగ్యం , ఫ్రిజ్ రెండూ తీవ్రంగా దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి ఆహారాన్ని .. నేరుగా ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా.. ఫ్రిజ్ పని తీరు కూడా తగ్గుతుంది.అసలు ఈ పొరపాటు ఎందుకు చేయకూడదు? ఫ్రిజ్‌లో ఆహారాన్ని స్టోర్ చేయడానికి సరైన పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది బిజీ లైఫ్ స్టైల్ కారణంగా వేడి వేడి కూరలు, అన్నం లేదా పాలను కొద్దిగా కూడా చల్లారబెట్టకుండా నేరుగా.. ఫ్రిజ్‌లో సర్దేస్తుంటారు. అయితే.. టెక్నికల్ , సైంటిఫిక్ పరంగా ఇది సరైన పద్ధతి కాదు. వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు, ఆ పదార్థం నుంచి వచ్చే ఉష్ణోగ్రత వల్ల ఫ్రిజ్ లోపలి వాతావరణం అకస్మాత్తుగా వేడెక్కుతుంది. దీని వల్ల ఫ్రిజ్‌లో ఇప్పటికే ఉంచిన ఇతర పండ్లు, కూరగాయలు, పాలు కూడా త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది.
ఫ్రిజ్ లోపల ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా పెరగకుండా ఆగి పోతుంది. కానీ మీరు వేడి ఆహారాన్ని.. పెట్టినప్పుడు, ఆ చుట్టు పక్కల ఉష్ణోగ్రత కొద్దిగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దీనిని ఫుడ్ సేఫ్టీ నిపుణులు “డేంజర్ జోన్” అంటారు. ఈ బ్యాక్టీరియా ఆహారాన్ని పాడు చేయడమే కాకుండా.. దానిని తిన్నవారిలో కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.
వేడి పదార్థాల వల్ల ఫ్రిజ్ లోపలి టెంపరేచర్ పెరిగినప్పుడు, ఆ ఉష్ణోగ్రతను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి ఫ్రిజ్ కంప్రెసర్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. దీనివల్ల ఎలక్ట్రిసిటీ వాడకం విపరీతంగా పెరిగి కరెంట్ బిల్లు భారీగా వస్తుంది. అంతేకాకుండా.. ఫ్రిజ్ జీవితకాలం కూడా క్రమంగా తగ్గిపోతుంది. మార్కెట్లో లభించే రూ. 15,000 నుంచి రూ. 50,000 పైబడిన ఏ రెఫ్రిజిరేటర్ అయినా ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే.. ఈ చిన్న పొరపాటు చేయకూడదు.
Also Read: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే అస్సలు తినలేరు!
చల్లారబెట్టడం: వంట చేసిన తర్వాత ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద సుమారు 30 నుంచి 45 నిమిషాల పాటు పూర్తిగా చల్లారబెట్టాలి.
ఎయిర్‌టైట్ కంటైనర్లు: వేడి తగ్గిన తర్వాత గాలిచొరబడದ ఎయిర్‌టైట్ బాక్స్‌లు.. లేదా డబ్బాలలో ఆహారాన్ని ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
చిన్న భాగాలుగా చేయడం: ఎక్కువ క్వాన్టిటీ ఉన్న ఆహార మైతే, చిన్న చిన్న గిన్నెల్లోకి మార్చడం ద్వారా అది త్వరగా చల్ల బడుతుంది.
వంటగదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచే అలవాటును.. ఈ రోజు నుంచే మార్చుకోండి. ఆహారాన్ని కొద్దిగా చల్లార బెట్టి స్టోర్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడు కోవడంతో పాటు మీ ఫ్రిజ్‌ను కూడా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.