రోజూ చేసే అన్నం, సాంబార్, కూరలే తింటే ఎలా.. ఓసారి కొత్తగా కోకోనట్ ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. తక్కువ సమయంలోనే తయారయ్యే వంటకం ఇది. కొబ్బరి వాసన, నెయ్యి రుచి, తేలికపాటి మసాలాల కలయిక ఈ రైస్‌ను చాలా ప్రత్యేకంగా చేస్తాయి. ముఖ్యంగా వీకెండ్ స్పెషల్‌గా ఈ రైస్ చాలా బాగుంటుంది. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కోకోనట్ రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యం – 2 కప్పులు
నీరు – అవసరమైనంత
ఉప్పు – తగినంత
తాజా కొబ్బరి తురుము – ఒక కప్పు
నూనె – రెండు స్పూన్లు
నెయ్యి – ఒక స్పూన్
ఆవాలు – ఒక స్పూన్
మినప్పప్పు – ఒక స్పూన్
శనగపప్పు – ఒక స్పూన్
ఎండుమిర్చి – రెండు
పచ్చిమిర్చి – రెండు
అల్లం తరుగు – ఒక స్పూన్
కరివేపాకు – గుప్పెడు
జీడిపప్పు – పది
మిరియాల పొడి – అర స్పూన్
Also read: Train: రైలు చివరి బోగీపై X గుర్తు ఎందుకు ఉంటుంది? దీని వెనుక అర్థమేంటి?
కోకోనట్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
1. ముందుగా బియ్యాన్ని రెండు మూడు సార్లు నీళ్లలో కడగాలి. ఇప్పుడు పొడిపొడిగా వచ్చేలా అన్నం వండుకోవాలి.
2. తాజా కొబ్బరిని తురిమి ఒక పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద కళాయి పెట్టాలి. అందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి.
4. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి.
5. తరువాత ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వేసి కొద్దిసేపు వేయించాలి.
6. ఇప్పుడు కరివేపాకు వేసి కలపాలి. కరివేపాకు వాసన వచ్చాక తురిమిన కొబ్బరిని పాన్‌లో వేసి మెల్లగా కలపాలి.
7. కొబ్బరి తురుము కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు తక్కువ మంటపై వేయించాలి.
8. ఎక్కువ వేయిస్తే కొబ్బరి కాలిపోయి చేదుగా మారుతుంది కాబట్టి జాగ్రత్త.
9. ఇప్పుడు అవసరమైనంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
10. తరువాత చల్లార్చిన అన్నాన్ని కొద్దికొద్దిగా పాన్‌లో వేసుకుంటూ నెమ్మదిగా కలపాలి. 2 నుంచి 3 నిమిషాలు తక్కువ మంటపై వేయించాలి.
11. వేయించిన జీడిపప్పులు వేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి వేసితే రుచి మరింత పెరుగుతుంది.
12. స్టవ్ ఆపేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచితే కొబ్బరి వాసన అన్నంలోకి బాగా ఇంకుతుంది. అంతే టేస్టీ కొబ్బరి రైస్ సిద్ధమైనట్టే
Also read: Diabetes: వందేళ్ల క్రితం భయంకరమైన వ్యాధి డయాబెటిస్, కానీ ఈ ఔషధంతో అంతా మారిపోయింది
కోకోనట్ ఫ్రైడ్ రైస్ ఇలా వండి చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా వండి చూడండి అద్భుతంగా ఉంటుంది.