Cartisol Reducing Habits| డిప్రెషన్ కలిగించే హార్మోన్ పేరు కార్టిసోల్. ఇది అడ్రినల్ గ్రంథి నుండి ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ హార్మోన్ ఇతర పనులు కూడా చేస్తుంది. ఇది జీవక్రియ, రోగనిరోధక శక్తి వంటి అనేక ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది. అయితే, ఈ హార్మోన్ ప్రధాన పాత్ర ఒత్తిడిని నిర్వహించడం. అందుకే దీనిని ‘స్ట్రెస్ హార్మోన్’ అని కూడా పిలుస్తారు. కార్టిసోల్ కొన్ని సమయాల్లో మంచిది అయినప్పటికీ, శరీరంలో ఇది నిరంతరం ఎక్కువగా ఉండడం హానికరం కావచ్చు.
ఉదయం వేళ సహజంగానే కార్టిసోల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది రోజు కార్యకలాపాలకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. దీనిని కార్టిసోల్ అవేకనింగ్ రెస్పాన్స్ (CAR) అని పిలుస్తారు. కార్టిసోల్ లెవెల్స్ నియంత్రిత స్థాయిలో ఉంటే రోజును శాంతియుతంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. అయితే ఈ హార్మోన్ నియంత్రించడం చాలా ముఖ్యం. లేకపోతే మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుత్తాయి. అందుకోసం ఉదయం నిద్రలేవగానే మొదటి 1-2 గంటల్లో కొన్ని అలవాట్లను పాటిస్తే, ఒత్తిడిని తగ్గించవచ్చు. ఈ ఆరోగ్యకరమైన ఉదయపు అలవాట్లు కార్టిసోల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.
ఉదయం కాఫీ వద్దు..
మేల్కొన్న వెంటనే కాఫీ తాగడం కార్టిసోల్ స్థాయిలను మరింత పెంచుతుంది. ఎందుకంటే ఉదయం సమయంలో కార్టిసోల్ సహజంగానే ఎక్కువగా ఉంటాయి. కాఫీలోని కెఫీన్ అడ్రినల్ గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. ఇది కాలక్రమేణా ఒత్తిడిని పెంచవచ్చు. బదులుగా, మేల్కొన్న తర్వాత నీరు లేదా హెర్బల్ టీ తాగండి. ఆ తరువాత 60-90 నిమిషాలు వేచి ఉండి.. కాఫీ తాగండి.
ఫోన్‌ను వెంటనే చూడకండి
ఉదయం మేల్కొన్న వెంటనే సోషల్ మీడియా, వార్తలు, లేదా ఆఫీస్ మెసేజ్ లు చూడడం తక్షణం ఒత్తిడిని పెంచేస్తుంది. దీనివల్ల కార్టిసోల్ స్థాయిలు పెరుగుతాయి. మేల్కొన్న తర్వాత 30-60 నిమిషాల వరకు ఫోన్‌ను ఉపయోగించకుండా ఉండండి. ఇది పని ఒత్తిడిని తగ్గించి, మనసును స్పష్టంగా ఉంచుతుంది.
ఒత్తిడి తగ్గించేందుకు సూర్యకాంతి
ఉదయం లేవగానే ఒక గంటలోపు సహజ సూర్యకాంతిని గ్రహించడం మీ శరీర గడియారాన్ని అంటే సర్కాడియన్ రిథమ్‌ని నియంత్రిస్తుంది. ఇది రోజంతా కార్టిసోల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఉదయం సూర్యకాంతి సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రాత్రి మెలటోనిన్‌గా మారి, నిద్రను మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది.
ఉదయం భోజనం తప్పక తినండి
ఉదయం భోజనం మానేయడం లేదా చక్కెర ఎక్కువ ఉన్న ఆహారాలు తినడం రక్తంలో చక్కెర స్థాయిలను అస్థిరం చేస్తుంది. ఇది కార్టిసోల్ విడుదలను ప్రేరేపిస్తుంది. ప్రోటీన్‌తో కూడిన ఆహారం, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లతో కూడిన భోజనం ఉదయం వేళ తింటే.. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.
నీరు తాగడం
మేల్కొన్న వెంటనే శరీరంలో నీరు తక్కువగా ఉంటే.. అది ఒత్తిడిని పెంచి కార్టిసోల్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఉదయం మేల్కొన్న వెంటనే ఒక గ్లాసు నీరు తాగడం శరీర కణాలను హైడ్రేట్ చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడికి సంబంధించిన అడ్రినల్ స్పందనను తగ్గిస్తుంది.
Also Read: పిల్లల్లో షుగర్ వ్యాధి.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే డేంజర్
ఈ సరళమైన ఉదయపు అలవాట్లు—కాఫీని వెంటనే తాగకపోవడం, ఫోన్‌ను కొంత సమయం వాడకుండా ఉండడం, సూర్యకాంతిని గ్రహించడం, ఆరోగ్యకరమైన ఉదయం భోజనం తినడం, నీరు తాగడం వంటి అలవాట్లు..ఉదయం మీ శరీరంలో కార్టిసోల్ స్థాయిలను తగ్గించడం ద్వారా డిప్రెషన్, మానసిక ఒత్తిడి లేకుండా రోజును శాంతియుతంగా, ఆరోగ్యకరంగా ప్రారంభించడానికి సహాయపడతాయి.