ఇంట్లో ఉన్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు… ఫ్రిజ్లోని ఐస్ ముక్కలను నేరుగా నోట్లో పెట్టుకొని కరకర నములుతూ ఉంటారు. ఇది కొంతమందికి వింతగా అనిపిస్తుంది. కానీ తినేవారికి మాత్రం ఎంతో హాయిగా అనిపిస్తుంది. తమకు ఐస్ ముక్కలు ఉంటే చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు. ఇది సాధారణ ప్రవర్తనగా ఎంతోమంది కొట్టి పడేస్తారు. కానీ ఇది సాధారణ ప్రవర్తన కాదు. తరచూ ఐస్ క్యూబ్స్ తీసుకుని నములుతున్నారంటే మీ శరీరంలో ఐరన్ లోపం ఉందని అర్థం చేసుకోవాలి. ఐరన్ లోపం అనేది రక్తహీనతకు కారణం అవుతుంది.
ఐస్ ముక్కలు నమిలేందుకు ఇదే కారణం
మీరు ఐస్ ముక్కలు ఎక్కువసేపు నమలడానికి ఇష్టపడినా లేదా ఎప్పుడూ ఐస్ క్యూబ్స్ తినాలని అనిపిస్తున్నా మీరు కచ్చితంగా కొన్ని పరీక్షలు చేసుకోవాలి. ఇలా ఐస్ నమలడాన్ని వైద్య పరిభాషలో పికా అంటారు. ఈ స్థితిలో ఆ వ్యక్తికి ఐస్ ముక్కలను చూస్తే చాలు కరకర నమిలేయాలనిపిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోయినప్పుడు ఈ పికా సమస్య వస్తుంది. వారికి ఐస్ క్యూబ్స్ తినాలన్న కోరిక పెరుగుతుంది. కాబట్టి శరీరంలో ఇనుము లోపాన్ని సవరించుకుంటే మీకు ఐస్ క్యూబ్స్ తినాలన్న కోరిక తగ్గిపోతుంది.
వీటిని తినండి
ఇనుము లోపాన్ని అధిగమించడానికి మీరు వైద్యుడు సలహా మేరకు మందులు వేసుకోవచ్చు. లేదా ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం ద్వారా శరీరంలో ఇనుమును పెంచుకోవచ్చు. శరీరంలో ఇనుము లోపం రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఖర్జూరం, నువ్వులు, పొద్దు తిరుగుడు గింజలు, ఎండు ద్రాక్ష వంటివి అధికంగా తింటూ ఉండాలి. గుమ్మడికాయ గింజలు, పాలకూర, బీట్రూట్, దానిమ్మ, పప్పులు, బెల్లం వంటి వాటిలో కూడా ఇనుము పుష్కలంగా ఉంటుంది. వీటిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
ఇనుము లోపం ప్రత్యేకంగా మహిళల్లో, పిల్లల్లో అధికంగా కనిపిస్తుంది. అందుకే మీరు ఎక్కువగా ఐస్ క్యూబ్స్ నములుతూ ఉంటారు. ఐస్ క్యూబ్స్ నమలడం వల్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా దంతాల ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి మీరు ఐస్ క్యూబ్స్ నములుతూ ఉంటే మీలో ఇనుములోపం ఉందని అర్థం చేసుకోండి. దానికి తగ్గట్టు ఆహారాన్ని మార్చుకోండి. ఐస్ క్యూబ్స్ నమలడం వల్ల దంతాల ఎనామిల్ పాడైపోతుంది. కొన్ని రోజులకే మీరు ఆహారం సరిగా తినలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఏది తిన్నా పళ్ళు జివ్వుమని లాగుతూ ఉంటాయి. కాబట్టి ఐసు గడ్డలు తినడం ఈరోజు నుంచే మాని ఇనుము ఉండే ఆహారాన్ని తినడం ప్రారంభించండి.