Cucumber: వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తీసుకోవడం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని వేడిని తగ్గించేందుకు సహాయపడే పదార్థాలను తరచుగా తీసుకునే డైట్‌లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాంటి వాటిలో కీర దోసకాయ ఒకటి. ఇది సులభంగా దొరికే కూరగాయ కావడంతో చాలా మంది దీన్ని ఇంటి భోజనంలో వాడుతుంటారు. అయితే, దీని వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి అంతగా అవగాహన ఉండకపోవచ్చు. సమ్మర్ డైట్‌లో దీన్ని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
కీర దోసకాయలో దాదాపు 95 శాతం నీళ్లే ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో దాహం తగ్గించేందుకు, శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఇది చాలా బాగా పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో ఎక్కువగా చెమట వస్తుంది. దీని వల్ల శరీరం నీటిని కోల్పోతుందట. అలాంటప్పుడు కీర దోసకాయ తింటే శరీరానికి అవసరమైన తేమను అందించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
శరీరాన్ని లోపల నుంచి చల్లబరచడమే కాకుండా కీర దోసకాయ చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. కీర దోసకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుందట. మొటిమలు, ట్యాన్‌ని తొలగించేందుకు కూడా ఇది హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కీర దోసకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే, బరువు తగ్గేందుకు డైటింగ్ చేయాలి అనుకునే వారు తమ ఆహారంలో దీన్ని చేర్చవచ్చు. మోతాదులోనే కేలరీలు శరీరంలోకి వెళ్లడం వల్ల ఎంత తిన్నా బరువు పెరుగుతారని భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
కీర దోసకాయలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఫైబర్ వల్ల జీర్ణక్రియ సజావుగా ఉంటుంది. వేసవిలో తరచుగా జీర్ణ సమస్యలు, గ్యాస్, పేగుల సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాటిని నివారించడానికి కీర దోసకాయ మంచి ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: మునగతో మాములుగా ఉండదు మరీ..!
ఇందులో పోటాషియం ఎక్కువగా ఉండటంతో రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. వేసవిలో డీహైడ్రేషన్ వల్ల బీపీ లెవెల్స్‌లో మార్పులు వచ్చే ఛాన్స్ ఉందట. అలాంటప్పుడు కీర దోసకాయ తినడం వల్ల హైబీపీ సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కీర దోసకాయను సలాడ్‌గా, పచ్చడిగా, జ్యూస్ రూపంలో లేదా మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. ఎక్కువగా ఉప్పు, మసాలాలు లేకుండా తినడం వల్ల ఇది శరీరానికి మరింత మేలు జరుగుతుంది. కీర దోసకాయను ఎక్కువగా వాడటం వల్ల కొందరికి గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.