ప్రకృతి మనకి ఎన్నో ఆరోగ్యకరమైన ఆహారాలను ఇచ్చింది. వాటిలో అరటి పండ్లు ఒకటి. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి అరటి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. హైబీపీతో ఉన్నవారు రోజుకు కనీసం ఒక అరటిపండు తినాలని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల బీపీ అదుపులో ఉంటుందని వారికి అన్ని రకాలుగా ఆరోగ్యం దక్కుతుందని వివరిస్తున్నారు.
అమెరికా జనరల్ ఆఫ్ ఫిజియాలజీ రీనల్ ఫిజియోలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం అరటిపండును అధికంగా తినడం వల్ల శరీరంలో పొటాషియం చేరుతుంది. ఇది రక్తపోటులో పెరుగుదలను అడ్డుకుంటుంది. దీని వల్ల వారు ఆరోగ్యంగా జీవించేందుకు అవకాశం దక్కుతుంది.
అరటి పండ్లు పొటాషియంతో నిండి ఉంటాయి. సగం అరటిపండులోనే దాదాపు 400 మైక్రోగ్రాముల పొటాషియం ఉంటుంది. ఇది మన రోజువారీ అవసరాల్లో 10 శాతాన్ని తీరుస్తుంది. కాబట్టి పొటాషియం లోపం రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఒక అరటిపండు తినాల్సిన అవసరం ఉంది.
హైబీపీ ఉన్నవారు అరటిపండును ఎందుకు తినాలో వైద్యులు వివరంగా చెబుతున్నారు. పొటాషియం మన శరీరంలో ఉండే సోడియం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. అలాగే మనం తినే ప్రాసెస్ చేసిన ఆహారం, స్నాక్స్, రెస్టారెంట్ భోజనాల వల్ల శరీరంలో ఉప్పు అధికంగా పెరిగిపోతుంది. దీనివల్ల ఉప్పులో ఉన్న సోడియం శరీరంలో నీటిని నిలుపుదల చేస్తుంది. ఇలా నీరు నిలిచిపోవడం వల్ల రక్త పరిమాణం పెరిగిపోతుంది. అదే హైబీపీగా మారుతుంది. ఇది అదుపులో ఉండాలంటే మనకు పొటాషియం అవసరం. అరటిపండులో పుష్కలంగా ఉంది. ఆ పొటాషియం మూత్రపిండాలు ద్వారా అదనపు సోడియంని మూత్రం రూపంలో బయటికి పంపిస్తుంది.
ప్రతిరోజు ఒక అరటిపండును తిని గుప్పెడు నట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. లేదా బనానా షేక్ చేసుకుని అందులో గుప్పెడు నట్స్ వేసుకుని ఆరోగ్యకరమైన అల్పాహారంగా మారుతుంది.
అరటిపండ్లు కేవలం పొటాషియం గురించి మాత్రమే కాదు. అందులో ఉండే కరిగే ఫైబర్ గురించి కూడా తినాల్సిన అవసరం ఉంది. దీన్ని డైటరీ ఫైబర్ అంటారు. డైటరీ ఫైబర్ అనేది రక్తపోటును నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అరటిపండులో ఉండే డైటరీ ఫైబర్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గితే ధమనుల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడవు. దీనివల్ల గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అరటిపండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ స్థాయిలు స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిస్, హైబీపీ… రెండూ ఉన్నవారు అరటిపండును అప్పుడప్పుడు తినాల్సిన అవసరం ఉంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు అరటిపండు తింటే అందులో ఉన్న చక్కెర శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివారు ఓట్స్ లో అర ముక్క అరటిపండును వేసుకొని తినడం మంచిది.
అరటిపండ్లలో తగినంత మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది రక్తనాళాలను సడలించి రక్తపోటును తగ్గించేందుకు సహాయపడుతుంది. రక్తనాళాల గోడలలో ఇన్ఫ్లమేషన్ కు తగ్గించడానికి నరాల పనితీరును నియంత్రించడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నా వారు మెగ్నీషియం లోపంతో కూడా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆకుకూరలను, నట్స్, సీడ్స్, తృణధాన్యాలు వంటివి కలిపి తినాల్సిన అవసరం ఉంది.
అరటిపండ్లలో సహజ చక్కెర ఉంటుంది. అలాగే ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ లేని వారు రోజుకు అరటి పండ్లు తినడం చాలా ముఖ్యం. ఇక డయాబెటిస్ ఉన్నవారు అరముక్క అరటిపండ్లను తింటే చాలు. డయాబెటిస్ ఉన్నవారికి అరటిపండు తినాలనిపిస్తే బాగా పండిన అరటిపండును తినకూడదు. కాస్త పచ్చిగా ఉన్నది తింటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.