Summer Tips: ఈ ప్రశ్న చాల మంది మదిలో మెదులుతుంది. ముఖ్యంగా ఫ్యాషన్ కు ప్రాధాన్యతనిచ్చే నేటితరం యువత ఈ సందేహాన్నిఎదుర్కొంటున్నారు. టోపీలు ధరించడం వల్ల జుట్టు ఓడిపోతుందనే నమ్మకం ఈ సమాజంలో విస్తృతంగా ఉంది, కానీ ఈ నమ్మకం ఎంత వరకు నిజం అనే దానిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ముందుగా జుట్టు ఊడిపోవడానికి గల ప్రధాన కారణాలు మనం అర్ధం చేసుకోవాలి. ఇది జన్యుపరమైన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహారలోపం, ఒత్తిడి, చర్మ సంబంధిత సమస్యలు, లేదా కొన్ని వైద్య, ఆరోగ్యసమస్యల వల్ల సంభవించవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఆండ్రోజెనెటిక్ అలోపేసియా (స్త్రీలు, పురుషులలో బట్టతల) వంశపారంపర్యంగా వచ్చే సమస్య టెలోజెనెఫ్లువియం వంటి పరిస్థితులు ఒత్తిడి, మెడిసిన్, లేదా గర్భధారణ తరువాత జుట్టు రాలడానికి కారణమవుతాయి. వీటితో పోలిస్తే టోపీ ధరిస్తే జుట్టు రాలడం అనేది చాల అరుదైన అంశం.
టోపీ వల్ల జుట్టు రాలుతుందనేది ఎలా వచ్చింది?
ఒక సాధారణ అపోహ ఏమిటంటే, టోపీలు తలకు గాలి ఆడకుండా చేస్తాయి, దీనివల్ల తల చర్మం గాలి తగలక బలహీన పడుతుంద. అయితే ఇది శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. తల చర్మంలోని జుట్టు స్థానాలు (Hair Follicles) రక్తం నుండి ఆక్సిజన్ను పొందుతాయి తప్ప బయట నుండి వచ్చే గాలి నుండి కాదు. కాబట్టి టోపీ పెట్టుకోవడంవల్ల జుట్టు స్థానాలకు ఆక్సిజన్ అందకపోవడం అనేది ఒట్టి అపోహ మాత్రమే అని వైద్యులు పేర్కొంటున్నారు .
మరో అపోహా ఏమిటంటే టోపీలు తల చర్మంపై ఒత్తిడి కలిగించి జుట్టు రాలడానికి కారణం అవుతాయి. నిజమే, చాలా బిగుతుగా ఉండే టోపీలు, రోజంతా ధరించే హెల్మెట్ ల వల్ల ఒత్తిడి కలగవచ్చు. దీనినే వైద్య పరిభాషలో ట్రాక్షన్ అలోపేసియా అంటారు. ఇది జుట్టును గట్టిగా లాగడం, లేదా తలపై నిరంతరం కలిగే ఒత్తిడి వల్ల వస్తుంది. సాధారణ టోపీలు ఈ స్థాయి ఒత్తిడిని కలిగించవు. సరైన సైజు, సౌకర్యవంతమైన టోపీని ఎంచుకోవడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చని వైద్యుల సూచన.
నిజమెంత?
మురికి టోపీలు, సరిగా శుభ్రం చేయని టోపీల వల్ల వచ్చే కొన్ని ముఖ్యమైన సమస్యలు ఏమిటంటే, అవి తల చర్మంలో చెమట, నూనె, లేదా బాక్టీరియాను చేర్చవచ్చు. ఇది చర్మ సమస్యలు అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ఉదాహరణకు సెబోర్హెయిక్ డెర్మటైటిస్ లేదా ఫోలిక్యూలైటిస్ వంటి సమస్యల వల్ల తల చర్మ ఆరోగ్యం దెబ్బతిని జుట్టు రాలడం జరగవచ్చు. కాబట్టి టోపీలను రోజు శుభ్రం చేసుకుని వాటిని గాలికి ఆరబెట్టడం చాల ముఖ్యమని నిపుణుల సలహా.
ALSO READ: తరచుగా మొహం ఉబ్బిపోతుందా? కారణం అదే కావచ్చు..
కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సమతుల్య ఆహరం తీసుకోవడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. ఒత్తిడిని నియంత్రించడం, తగినంత నీరు తాగడం, అలాగే తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యం. మనం ధరించే టోపీ చాల బిగుతుగా కాకుండా శ్వాస క్రియకు అనువైన పదార్ధంతో తయారైనదై ఉండేలా చూసుకోవాలి.
శాస్త్రీయంగా చూస్తే టోపీ ధరించడం వల్ల జుట్టు రాలడానికి నేరుగా సంబంధం లేదని స్పష్టమవుతుంది. అయితే తల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సరైన టోపీలను ఎంచుకోవడం వల్ల ఈ అపోహను పూర్తిగా తొలగించవచ్చు. ఫ్యాషన్ కు భయపడకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఇష్టమైన టోపీని ధరించవచ్చు అని వైద్యులు పేర్కొంటున్నారు.