Dog Meat Soup| ఆరోగ్యానికి కుక్క మాంసం, దాని సూప్ తాగితే మంచిదని ఏకంగా ఒక దేశ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఈ ఘటన ఉత్తర కొరియాలో జరిగింది. కొరియా ద్వీపకల్పంలో ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ సమయంలో ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రజలకు పలు ఆరోగ్య సూచనలు చేసింది. వేసవిలో శరీరానికి బలాన్నిచ్చే పోషకాహారం తీసుకోవాలని సూచించింది. అయితే ఈ జాబితాలో డాగ్ మీట్ (కుక్క మాంసం) సూప్ కూడా ఉండటం చర్చకు దారితీసింది.
ఉత్తర కొరియా ప్రభుత్వానికి చెందిన మీడియా కంపెనీ రోడాంగ్ సిన్మున్ ఈ ఆరోగ్య సూచనలు ప్రచురించింది. డాగ్ మీట్ సూప్ తమ సంప్రదాయ ఆహారంలో భాగమని అధికారులు చెబుతున్నారు.
కుక్క మాంసంలో ఇతర ఎర్ర మాంసాల (మటన్, బీఫ్, ఒంటె మాంసం) మాదిరిగానే ప్రోటీన్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు ఉండవచ్చు. అయితే, దీన్ని ప్రత్యేకంగా ఆరోగ్యకరమైన ఆహారంగా డాక్టర్లు అంగీకరించడం లేదు. సరిగా శుభ్రపరచని, నిల్వ చేయని లేదా ఉడికించని మాంసం వల్ల రేబీస్ వంటి వ్యాధులు, పరాన్నజీవులు, బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
చారిత్రకంగా కుక్క మాంసం కొన్ని ప్రాంతాల్లో ఆహారంగా ఉపయోగించారు. పరిమిత స్థాయిలో చైనా, వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, దక్షిణ కొరియా, నైజీరియా, ఘనా, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాల్లో దీని వినియోగం నమోదైంది. అయితే ప్రతి దేశంలో చట్టాలు, ఆహార సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే, సురక్షితమైన ఇతర ప్రోటీన్ వనరులు అందుబాటులో ఉన్నందున కుక్క మాంసాన్ని ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిన అవసరం లేదు.
వేసవి సమయంలో ప్రజలు పౌష్టికాహారం తీసుకోవాలని ఉత్తర కొరియా సూచించింది. అలాగే శరీరంలో నీటి లోపం రాకుండా ఎక్కువ నీరు తాగాలని కోరింది. పుచ్చకాయ, దోసకాయ, పెసలు వంటి ఆహార పదార్థాలను కూడా సూచించింది. వీటితో పాటు డాగ్ మీట్‌తో తయారు చేసే సూప్‌ను కూడా ప్రస్తావించింది. ఉత్తర కొరియాలో ఈ సూప్.. చాలా కాలంగా సంప్రదాయ ఆహారంగా గుర్తింపు ఉంది. ముఖ్యంగా వేసవిలో దీన్ని శరీరానికి బలం ఇచ్చే ఆహారంగా భావిస్తారు.
వేసవిలో అత్యంత వేడిగా ఉండే కాలాన్ని అక్కడి సంప్రదాయాల్లో ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ సమయంలో డాగ్ మీట్ సూప్ తాగే సంప్రదాయం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఉత్తర కొరియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 డిగ్రీల మధ్య ఉంటున్నాయి. అదే సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 25 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొంటున్నారు.
ఎక్కువ ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రజలు తగినంత నీరు తాగాలని, హీట్ స్ట్రోక్ నుంచి రక్షణ పొందాలని అధికారులు కోరారు. వేడి సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం కూడా ముఖ్యమని తెలిపారు.
Also Read: లేడీ లక్.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను భర్త ఎంతో గారబంగా చూసుకుంటారు
ఉత్తర కొరియాలో డాగ్ మీట్‌తో తయారు చేసే వంటకాలకు చాలా సంవత్సరాల చరిత్ర ఉంది. ప్యాంగ్యాంగ్‌లో ఇలాంటి వంటకాలను అందించే ప్రత్యేక రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం గతంలో డాగ్ మీట్ వంటకాలతో వంటల పోటీలను కూడా నిర్వహించింది. ఈ ఆహారాన్ని దేశ సంప్రదాయ వంటకాల్లో భాగంగా అధికారులు ప్రచారం చేస్తున్నారు. అయితే డాగ్ మీట్ సూప్ ఖరీదైన ఆహారం కావడంతో ప్రతి ఒక్కరూ దీన్ని కొనలేరు. ఇతర దేశాల్లో మాత్రం డాగ్ మీట్ వినియోగంపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.
దక్షిణ కొరియా డాగ్ మీట్ పరిశ్రమను పూర్తిగా ముగించే దిశగా చర్యలు చేపట్టింది. 2024లో ప్రభుత్వం దీనికి సంబంధించిన కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఆ చట్ట ప్రకారం.. ఆహారం కోసం కుక్కలను పెంచడం, చంపడం, విక్రయించడం, పంపిణీ చేయడంపై నిషేధం ఉంటుంది. ఈ నిబంధనలు 2027 ఫిబ్రవరి 7 నుంచి పూర్తిగా అమల్లోకి వస్తాయి.
నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. అలాగే 3 కోట్ల దక్షిణ కొరియా వోన్ వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇలా ఒకవైపు ఉత్తర కొరియా సంప్రదాయ డాగ్ మీట్ వంటకాలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు దక్షిణ కొరియా ఈ పరిశ్రమను పూర్తిగా ముగించేందుకు సిద్ధమవుతోంది.