Skin Care Mistakes: వర్షాకాలం ఆహ్లాదకరంగా, చల్లగా ఉన్నప్పటికీ.. మన చర్మానికి కొన్ని సవాళ్లను విసురుతుంది. ఈ సీజన్‌లో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల చర్మం జిడ్డుగా మారడం, మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పాటు ఇతర చర్మ సమస్యలు వస్తాయి. చాలా మంది వర్షాకాలంలో సరైన స్కిన్‌కేర్ పాటించరు. ఇంకొందమంది మాత్రం తరచుగా కొన్ని పొరపాట్లు చేస్తారు. దీనివల్ల చర్మ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. వర్షాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి మీరు అస్సలు చేయకూడని కొన్ని సాధారణ స్కిన్‌కేర్ పొరపాట్లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్లెన్సింగ్‌ను నిర్లక్ష్యం చేయడం:
వర్షాకాలంలో జిడ్డు ఎక్కువగా ఉంటుందని, చర్మం పొడిబారదని చాలామంది క్లెన్సింగ్‌ను నిర్లక్ష్యం చేస్తారు. ఇది పెద్ద పొరపాటు. అధిక తేమ, కాలుష్యం, వర్షపు నీరు చర్మంపై చేరినప్పుడు రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో రోజుకు కనీసం రెండు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
మాయిశ్చరైజర్‌ను మానేయడం:
వర్షాకాలంలో చర్మం జిడ్డుగా ఉంటుందని మాయిశ్చరైజర్ వాడటం మానేయడం మరో సాధారణ పొరపాటు. తేమ ఎక్కువగా ఉన్నప్పటికీ, చర్మం హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. మాయిశ్చరైజర్ లేకపోతే చర్మం జిడ్డును మరింత ఉత్పత్తి చేసి.. సమస్యలను పెంచుతుంది. అందుకే ఇలాంటి సమయంలో లైట్‌వెయిట్, నాన్-కామెడోజెనిక్ (రంధ్రాలను మూసివేయని) లేదా జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం మంచిది.
సన్‌స్క్రీన్‌ను ఉపయోగించకపోవడం:
మేఘాలు కమ్ముకుని ఉన్నా లేదా వర్షం పడుతున్నా సూర్యరశ్మి నుంచి వచ్చే హానికరమైన UV కిరణాలు చర్మాన్ని చేరుకుంటాయి. సన్‌స్క్రీన్ వాడకపోతే డార్క్‌స్పాట్స్, టానింగ్ , చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. కనీసం SPF 30 ఉన్న వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్‌ను వర్షాకాలంలో కూడా తప్పనిసరిగా వాడాలి.
ఎక్కువగా స్క్రబ్ చేయడం:
జిడ్డును తగ్గించుకోవడానికి కొందరు తరచుగా స్క్రబ్ చేస్తుంటారు. ఇది చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. అంతే కాకుండా సున్నితంగా మారుస్తుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మైల్డ్ ఎక్స్‌ఫోలియేటర్‌ను ఉపయోగించడం మంచిది. ఎక్కువ స్క్రబ్బింగ్ చర్మంపై మంటను కూడా కలిగించవచ్చు.
Also Read: ఎండు ఖర్జూరాలు తింటే.. అద్బుతమైన ప్రయోజనాలు !
తడి బట్టలు లేదా తడి జుట్టుతో ఉండటం:
వర్షంలో తడిసినప్పుడు.. వెంటనే బట్టలు మార్చుకోకుండా తడి బట్టలతో ఉండటం లేదా తడి జుట్టుతో ఎక్కువసేపు ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వర్షంలో తడిసిన వెంటనే పొడి బట్టలు ధరించడం, జుట్టును త్వరగా ఆరబెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.
హెవీ మేకప్ వాడటం:
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల హెవీ మేకప్ తేమతో కలిసి చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. ఇది మొటిమలు, దద్దుర్లు ,ఇతర చర్మ సమస్యలకు దారితీస్తుంది. ఈ కాలంలో లైట్ లేదా వాటర్‌ప్రూఫ్ మేకప్ ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది. వీలైనంత వరకు మేకప్‌ను తగ్గించడం మంచిది. అంతే కాకుండా ఈ సీజన్ లో నేచురల్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.