Longevity: దీర్ఘాయువు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఆధునిక కాలంలో తరిగిపోతున్న ఆయుష్ఫును పెంచుకునేందుకు ఆహారంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. మీరు కూడా అదే పద్ధతి ఫాలో అవ్వాలనుకుంటే గ్రీన్ టీ ని రోజూ తాగేందుకు ప్రయత్నించండి.
మన ఆహారంలో, ఆలోచనల్లో, జీవన శైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం ద్వారా ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుంది. ప్రాథమిక కాలంలో చెడు ఆహారపు అలవాట్లు అధికంగా ఉన్నాయి. అందుకే త్వరగా ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. మీ ఆయుష్షును పెంచుకోవాలనుకుంటే గ్రీన్ టీనే తాగేందుకు ప్రయత్నించండి. ప్రతిరోజు గ్రీన్ టీ తాగితే ఆయుష్షు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
రోజుకు మూడు కప్పులకు తగ్గకుండా గ్రీన్ టీ తాగితే ఆయుర్దాయం పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రసిద్ధ పరిశోధకుడు, రచయిత అయిన బుట్నర్ వివరించారు. గ్రీన్ టీ లో 1500 సమ్మేళనాలు ఉంటాయని, వాటిలో కొన్ని మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని ఆయన వివరించారు. అయితే వాటిలో ఏది ఎక్కువగా దోహదపడతాయో మాత్రం కచ్చితంగా చెప్పలేమని అన్నారు.
జపాన్లో గ్రీన్ టీని ఎక్కువగా తాగుతూ ఉంటారు. అందుకే జపనీయుల ఆయుర్దాయం కూడా అధికంగా ఉంటుందని చెప్పుకుంటారు. గ్రీన్ టీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఆయుష్షుని పెంచుతుందని అనేక శాస్త్రీయ పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
2011లో చేసిన ఒక పరిశోధన ప్రకారం మొక్కల ఆధారిత యాంటీ ఆక్సిడెంట్ అయిన కాటేచిన్స్ గ్రీన్ టీలో అధికంగా ఉంటాయి. ఈ టీని తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయో గుండె జబ్బులు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. అంటే అకాల మరణం సంభవించకపోవచ్చు.
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ 2013లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పానీయాల రూపంలో లేదా సప్లిమెంట్ గా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీనే క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. గ్రీన్ టీ మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే పాలీ పెనాల్స్ అభిజ్ఞ క్షీణతను నెమ్మదించేలా చేస్తాయని, చిత్తవైకల్యం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని అంటారు.
మెదడు పనితీరు మెరుగుపరచడానికి ప్రతిరోజు గ్రీన్ టీ తాగాల్సిన అవసరం ఉంది. ఇది న్యూరో డిజనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. 2025లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం వల్ల పురుషులకు అదనపు రక్షణ లభిస్తుందని తేలింది.
మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సులభమైన మార్గం గ్రీన్ టీ తాగడమేనని ఎన్నో అధ్యయనాలు కూడా వివరిస్తున్నాయి.
Also Read: బరువు త్వరగా తగ్గాలనుకుంటున్నారా? ఉత్తమ ఫలితాలు ఇచ్చే 5 రకాల టీలు ఇవిగో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.