Cough Home Remedies: దగ్గు అనేది సాధారణంగా జలుబు, ఫ్లూ లేదా ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. ఇది అసౌకర్యంగా ఉన్నా, కొన్నిసార్లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. తీవ్రమైన దగ్గు నిద్రలేమికి దారితీస్తుంది. ఇదిలా ఉంటే.. కొన్ని ఇంటి చిట్కాలు దగ్గును త్వరగా తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. దగ్గు తీవ్రంగా ఉంటే లేదా కొన్ని రోజుల కంటే ఎక్కువగా ఉంటే, తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించాలి.
దగ్గును క్షణాల్లో తగ్గించే ఇంటి చిట్కాలు:
దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు.. తక్షణ ఉపశమనం కోసం కొన్ని సులభమైన హోం రెమెడీస్ కూడా ప్రయత్నించవచ్చు. ఇవి సాధారణ దగ్గుకు బాగా పనిచేస్తాయి.
1. తేనె:
తేనె దగ్గు నివారణకు ఒక అద్భుతమైన ఔషధం. ఇది సహజసిద్ధమైన యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
ఎలా వాడాలి: ఒక టీస్పూన్ తేనెను నేరుగా తీసుకోవచ్చు. లేదా.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. రాత్రి పడుకునే ముందు తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది.
2. అల్లం:
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి గొంతులోని మంటను తగ్గిస్తాయి.
ఎలా వాడాలి: ఒక చిన్న అల్లం ముక్కను శుభ్రంగా కడిగి నమలవచ్చు. లేదా.. కొన్ని అల్లం ముక్కలను నీటిలో వేసి మరిగించి, ఆ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకుని తాగాలి. అల్లం టీ కూడా దగ్గుకు మంచి ఉపశమనం ఇస్తుంది.
3. పసుపు పాలు:
పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీలక సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీవైరల్, యాంటీబాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.
ఎలా వాడాలి ?
ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకొని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇది దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
4. ఉప్పు నీటి పుక్కిలింతలు:
గొంతులో గరగర, నొప్పి, దగ్గు ఉన్నప్పుడు ఉప్పు నీటితో పుక్కిలించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
ఎలా వాడాలి ?
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి.. ఆ నీటితో రోజుకు 2-3 సార్లు పుక్కిలించాలి. ఇది గొంతులోని కఫాన్ని తగ్గించి, ఉపశమనాన్ని ఇస్తుంది.
Also Read: ఉదయం పూట వెల్లుల్లి తింటే.. ఎన్ని లాభాలో తెలుసా ?
5. తులసి ఆకులు:
తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇవి దగ్గు, జలుబు, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
ఎలా వాడాలి ?
కొన్ని తులసి ఆకులను నేరుగా కూడా నమలవచ్చు. లేదా.. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ కషాయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. తేనె కలిపితే మరింత రుచిగా ఉంటుంది.
6. ఆవిరి పట్టడం:
శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడానికి ఆవిరి పట్టడం చాలా మంచి పద్ధతి.
ఎలా వాడాలి ?
ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని.. అందులో కొన్ని యూకలిప్టస్ ఆయిల్ చుక్కలు వేసి.. ఒక టవల్ తో తల కప్పుకుని ఆవిరిని పీల్చాలి. ఇది ముక్కు దిబ్బడ, గొంతు నొప్పిని తగ్గించి, దగ్గు నుంచి ఉపశమనం అందిస్తుంది.