మనం నిత్యం పండ్లు, కూరగాయలు తింటూ ఉంటాం. వాటిలో కొన్నింటిని తొక్క తీసి తింటే, మరికొన్నింటిని తొక్కతోనే తింటారు. తొక్క తీయని పండ్లు, కూరగాయల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ వీటి తొక్కలతో కలిగే లాభం ఏంటి? ఒకవేళ వీటి తొక్కలు తీసివేస్తే ఎలాంటి పోషకాలను కోల్పోయే అవకాశం ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
తొక్క తీయకుండా తినాల్సిన పండ్లు
⦿ ఆపిల్: కొంత మంది ఆపిల్ ను తొక్కతీసి తింటారు. అలా చేయకూడదంటున్నారు నిపుణులు. ఆపిల్ తొక్కలో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. రోగాలను దరిచేరకుండా కాపాడుతుంది. ఆపిల్ తొక్కలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని పైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
⦿ పీచ్: పీచ్ తొక్కలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తొక్కతో తినడం వల్ల ఎన్నో రోగాలు దూరం అవుతాయి. అదే సమయంలో పండులోని కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఆరోగ్యానికి సాయపడుతాయి.
⦿ జామపండు: జామ తొక్కలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. తొక్కతో తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
⦿ మామిడి: ఫలరాజు మామిడి పండును కూడా తొక్కతోనే తినాలి. మామిడి తొక్కలో పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్, ప్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలను అరికడుతాయి.
తొక్కతో తినాల్సిన కూరగాయలు
⦿ టమాట: టమాట తొక్కలో బోలెడు పోషకాలు ఉంటాయి. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.
⦿ ఆలుగడ్డలు: చాలా మంది ఆలుగడ్డలను తొక్కతీసి వంట చేస్తారు. కానీ, అలా చేయకూడదంటున్నారు నిపుణులు. ఆలుగడ్డ తొక్కలో పైబర్, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు ఎర్రరక్త కణాల ఉత్పత్తికి సాయపడుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది.
⦿ క్యారెట్లు: క్యారెట్ తొక్కలలో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులోని బీటా కెరోటిన్, లిటిన్ సమ్మేళనాలు కంటికి మేలు చేస్తాయి. క్యారెట్ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే, వీలైనంత వరకు క్యారెట్లను తొక్క తీయకుండానే, శుభ్రంగా కడిగి తినడం మంచిది.
⦿ కీరాదోస: ఆయా విందులు, వినోదాల సమయంలో కీరాదోస తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పెడతారు. కానీ, అలా చేయకూడదంటున్నారు నిపుణులు. కీరా తొక్కలో బోలెడు పోషకాలు ఉంటాయి. కీరా తొక్కలోని సిటోస్ట్రెల్ వాపును తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కొంత మంది మాత్రం.. కూరగాయాలు, పండ్ల మీద పెద్ద మొత్తంలో పురుగు మందులు పిచికారి చేస్తారని, వాటిని అవశేషాలన్నీ తొక్కలోనే ఉంటాయని చెప్తున్నారు. వాటిని తొక్కతీయకుండా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉందంటున్నారు. ఎక్కువ మంది మాత్రం తొక్క తీయకుండా ఉప్పునీటిలో శుభ్రంగా కడిగి, తుడిచి తినడం మంచిదని చెప్తున్నారు.
Read Also: గుడ్డు మంచిదా, పాడైందా తెలుసుకోవాలంటే.. సింపుల్ గా ఇలా చెయ్యండి!