Cold: జలుబు అనేది చాలా మందికి సాధారణంగా వచ్చే ఒక ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్య. ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు మన రోజువారీ పనులకు అడ్డుపడతాయి. అయితే.. కొన్ని చిట్కాలను పాటిస్తే, జలుబు లక్షణాల నుండి రాత్రికి రాత్రే ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పసుపు పాలు:
రాత్రి పడుకునే ముందు పాలలో కొద్దిగా పసుపు, మిరియాల పొడి కలిపి తాగడం వల్ల జలుబుకు ఉపశమనం లభిస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మిరియాలు శ్వాస మార్గాలను శుభ్రం చేయడానికి సహాయపడతాయి.
2. గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం:
గొంతు నొప్పి, వాపు నుంచి ఉపశమనం పొందడానికి, గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం చాలా ఉపయోగపడుతుంది. ఇది గొంతులోని వైరస్, బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది.
3. ఆవిరి పట్టడం:
ఆవిరి పట్టడం అనేది జలుబుకు ఒక మంచి పరిష్కారం. వేడి నీటిలో కొన్ని యూకలిప్టస్ ఆయిల్ చుక్కలు వేసి ఆవిరి పడితే, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గుతాయి. ఆవిరి పీల్చడం వల్ల శ్వాస మార్గాలు తెరుచుకుంటాయి. తద్వారా సులువుగా శ్వాస తీసుకోవచ్చు.
4. తగినంత నిద్ర:
నిద్ర అనేది మన శరీరానికి ఒక ఔషధం లాంటిది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి తగినంత నిద్ర అవసరం. జలుబు చేసినప్పుడు కనీసం 7-8 గంటల పాటు నిద్రపోవాలి. నిద్రలో ఉన్నప్పుడు శరీరం వైరస్‌తో పోరాడుతుంది.
5. వేడి ద్రవపదార్థాలు తాగడం:
చికెన్ సూప్, వెజిటబుల్ సూప్, హెర్బల్ టీ, వేడి నిమ్మరసం వంటివి తాగడం వల్ల గొంతుకు ఉపశమనం లభిస్తుంది. ఇవి శరీరానికి హైడ్రేషన్‌ను అందించి, జలుబు లక్షణాలను తగ్గిస్తాయి.
6. అల్లం, తేనె:
అల్లం ముక్కలను మెత్తగా నలిపి, వేడి నీటిలో వేసి, దానిలో ఒక స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. తేనె దగ్గును తగ్గిస్తుంది.
Also Read: వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ఉండాలంటే ?
7. విటమిన్ సి:
నిమ్మ, నారింజ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నిమ్మరసం తాగడం జలుబును నివారించడంలో సహాయపడుతుంది.
ఈ చిట్కాలు జలుబు నుంచి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. లక్షణాలు తగ్గకపోతే.. డాక్ట్రర్‌ని సంప్రదించడం తప్పనిసరి. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాలను పాటించే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. తగినంత విశ్రాంతి.. పోషకాహారం తీసుకుంటే జలుబు త్వరగా నయమవుతుంది.