Green Tea: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గడంలో అంతే కాకుండా జీవక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడంలో కూడా సహాయపడుతుంది. కానీ, గ్రీన్ టీని సరైన పద్ధతిలో.. సరైన సమయంలో తాగితేనే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. బరువు తగ్గడం కోసం గ్రీన్ టీ తాగడం మంచిదని చాలా మంది చెబుతుంటారు. ఇంతకీ రోజుకు ఎంత మోతాదులో గ్రీన్ టీ తాగాలి అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడు తాగాలి?
గ్రీన్ టీని సరైన సమయంలో తాగడం వల్ల దాని ప్రయోజనాలు పూర్తిగా లభిస్తాయి. ఉదయం పూట వ్యాయామం లేదా వాకింగ్‌కు ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే జీవక్రియ రేటు పెరిగి, బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. అలాగే.. మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమై, కొవ్వు చేరడం తగ్గుతుంది. సాయంత్రం వేళ.. చిరుతిళ్లకు బదులుగా గ్రీన్ టీ తాగడం వల్ల అనవసరమైన కేలరీలు తీసుకోకుండా ఉంటారు.
ఎలా తాగాలి?
వేడి నీటిలో నిలపడం: గ్రీన్ టీని తయారుచేసేటప్పుడు.. చాలా వేడి నీటిలో (మరీ మరిగే నీరు కాదు) గ్రీన్ టీ బ్యాగ్‌ని లేదా ఆకులను 2-3 నిమిషాల పాటు ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే చేదుగా మారి రుచి తగ్గిపోతుంది.
చక్కెర, పాలు వద్దు: గ్రీన్ టీకి చక్కెర, పాలు కలపడం వల్ల దానిలోని పోషకాలు తగ్గిపోతాయి, అదనపు కేలరీలు చేరుతాయి. బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని అలాగే తాగడం మంచిది. కావాలనుకుంటే రుచి కోసం కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు. కానీ అవి కూడా చాలా తక్కువ మోతాదులో మాత్రమే.
తేనె ఎప్పుడు కలపాలి?: వేడి గ్రీన్ టీలో తేనె కలపకూడదు. టీ కొద్దిగా చల్లబడిన తర్వాత తేనె కలపాలి. అప్పుడే దాని పోషక విలువలు అలాగే ఉంటాయి.
ఖాళీ కడుపుతో వద్దు: ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల కొంత మందిలో కడుపులో అసౌకర్యం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. అందుకే ఏదైనా తిన్న తర్వాతే తాగడం మంచిది.
ఎంత తాగాలి?
రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగడం సురక్షితం. అంతకు మించి తాగితే కెఫిన్ అధికంగా శరీరంలోకి చేరి నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు. ఒక్కో కప్పులో 20-45 మి.గ్రా కెఫిన్ ఉంటుంది. కాబట్టి రోజువారీ మోతాదుకు మించకుండా జాగ్రత్త పడాలి.
Also Read: ఐరన్ రిచ్ ఫుడ్స్‌తో.. రక్తహీనత దూరం
బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది ?
గ్రీన్ టీలో “కాటెచిన్స్” అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా EGCG (ఎపిగాల్లోకాటెచిన్ గల్లేట్). ఇవి జీవక్రియను వేగవంతం చేసి, కొవ్వును కరిగించే ప్రక్రియను పెంచుతాయి. అలాగే.. ఇందులో ఉండే కెఫిన్ శక్తి స్థాయిలను పెంచుతుంది. తద్వారా శారీరక శ్రమకు తోడ్పడుతుంది.
గ్రీన్ టీ బరువు తగ్గడానికి ఒక అద్భుతమైన మార్గం. కానీ.. కేవలం గ్రీన్ టీ తాగడం వల్ల మాత్రమే బరువు తగ్గడం సాధ్యం కాదు. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిపి గ్రీన్ టీని ఉపయోగించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ తాగడం ప్రారంభించే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.